Share News

Sampath Kumar: పెట్టుబడులపై రాజకీయాలెందుకు?!

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:32 AM

అమెరికాలో స్వచ్‌ బయోకంపెనీ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తే.. బీఆర్‌ఎస్‌ నేతలు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మండిపడ్డారు.

Sampath Kumar: పెట్టుబడులపై రాజకీయాలెందుకు?!

  • ఓర్వలేక విషం కక్కుతున్న బీఆర్‌ఎస్‌: సంపత్‌ కుమార్‌

  • కేటీఆర్‌ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు?: చామల

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): అమెరికాలో స్వచ్‌ బయోకంపెనీ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తే.. బీఆర్‌ఎస్‌ నేతలు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం సంపత్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే వారు అమెరికా పర్యటనకు వెళ్లారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండడం చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు సీఎం, ఆయన కుటుంబసభ్యులపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్తే.. అధికారిక పర్యటన ఎలా అవుతుందని ప్రశ్నించారు.


గతంలో అనేక సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్‌ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ రాజకీయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం.. హాస్యాస్పదంగా ఉందన్నారు. తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు ఏనాడైనా ప్రపంచ బ్యాంకు తలుపు తట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారులు, మంత్రులను తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళితే బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇకనైనా పద్థతి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలని హితబోధ చేశారు. రోజుల తరబడి కేటీఆర్‌, హరీశ్‌రావు ఢిల్లీలో ఉండడాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

Updated Date - Aug 09 , 2024 | 04:32 AM