Secunderabad: ఉదయం బీజేపీ అభ్యర్థి ప్రచారంలో.. మధ్యాహ్నం కాంగ్రెస్‌లోకి..
ABN , Publish Date - Mar 20 , 2024 | 11:56 AM
బీజేపీ(BJP) కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన కీలకనేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. మంగళవారం కాంగ్రెస్(Congress) కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఉప ఎన్నికల్లో సైతం అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్న ఎన్.శ్రీగణేష్ హస్తం గూటికి చేరా రు.
- హస్తం గూటికి ఎన్.శ్రీగణేష్
సికింద్రాబాద్: బీజేపీ(BJP) కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన కీలకనేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. మంగళవారం కాంగ్రెస్(Congress) కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఉప ఎన్నికల్లో సైతం అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్న ఎన్.శ్రీగణేష్ హస్తం గూటికి చేరా రు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుల చొరవతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే్‌షకుమార్‌గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి రాజేందర్‌తో కలిసి మంగళవారం ఉదయం కంటోన్మెంట్‌లో జరిగిన కార్యక్రమాల్లో గణేష్ పాల్గొన్నారు. మధ్యాహ్నం కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు.
పార్టీ మారడం ఇది రెండోసారి
మాజీ మంత్రి జె.గీతారెడ్డి శిష్యుడిగా సుపరిచితుడైన గణేష్ 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం యత్నించారు. 2018 ఎన్నికల్లోనూ విశ్వప్రయత్నం చేశారు. రెండుసార్లూ నిరాశే ఎదురైంది. దాంతో చివరి నిమిషంలో కాషాయ కండువా కప్పుకుని, గత ఎన్నికల్లో బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడంతో. మల్కాజిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో కారెక్కారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అసెంబ్లీ టికెట్ తనకే దక్కుతుందని అనుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న హఠాన్మరణం చెందడంతో ఆయన వారసురాలిగా కుమార్తె లాస్యనందితకు బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించింది. దాంతో మళ్లీ శ్రీగణేష్ కాషాయ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లాస్యనందిత మృతి వల్ల త్వరలో జరిగే కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీగణేష్ బీజేపీ నుంచి పోటీచేస్తారని అందరూ భావించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 40వేల ఓట్లు సాధించి, రెండోస్థానంలో నిలిచిన గణేష్.. ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. అనూహ్యంగా మంగళవారం మధ్యాహ్నం ఆయన హస్తం గూటికి చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.