Supreme Court : రేవంత్ వ్యాఖ్యలు సరి కావు!
ABN, Publish Date - Aug 30 , 2024 | 02:36 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
కవిత బెయిల్‌పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్
సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలా?
నేతలను సంప్రదించి తీర్పులిస్తున్నామా?
రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరగండి
సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి
రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతారు?
ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే..
ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ
ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక
తొలుత కేసు బదిలీకి న్యాయమూర్తులు విముఖం
సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం 2కు వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి స్థాయి రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఆయన న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లు వ్యాఖ్యానించారని చెప్పింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం వాదనల సందర్భంగా ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘‘తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్‌ఎస్ పని చేసిందని, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్లే కవితకు
బెయిల్ వచ్చిందని సీఎం కామెంట్ చేశారు’’ అని కవిత తరఫున్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్రంగా మందలించింది. జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ... ‘‘ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొందరి ఆలోచనల్లో భయాలు రేకెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము తీర్పులు ఇస్తున్నామా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయమూర్తులుగా మేం ప్రమాణం చేస్తాం. మనస్సాక్షిగానే మా విధిని నిర్వర్తిస్తాం’’ అని స్పష్టం చేశారు. మరో న్యాయమూర్తి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ జోక్యం చేసుకొని... ‘‘ఇది ఒక సీఎం హోదాలో ఉన్న బాధ్యత గల వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలా? సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలని ప్రాథమిక కర్తవ్యం చెప్పలేదా? గౌరవం కలిగి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.
మరోసారి జస్టిస్ గవాయి అసంతృప్తి వ్యక్తం చేస్తూ... చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని, అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా తాము అదే ఆశిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు అదేశాలపై వ్యాఖ్యానించిన మహారాష్ట్ర ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల గౌరవం లేకుండా, ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉంటే ఆయన తెలంగాణ బయటి కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని మందలించింది. కాగా... ప్రభుత్వం తరపున రోహత్గీ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అంతలోనే.. మరో సీనియర్ న్యాయవాది సిథార్థ లూథ్రా ముఖ్యమంత్రికి కౌన్సిలింగ్ ఇస్తామని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో పిటిషనర్ తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు స్పందిస్తూ... సుప్రీంకోర్టు గురించి ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు హైకోర్టు, దిగువ కోర్టుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు.
హోంశాఖ సీఎం దగ్గరే ఉంది
ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్వవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ బీఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్థార్థ్ లూథ్రా, మేనకా గురుస్వామి, న్యాయవాదులు శ్రావణ్ కుమార్, ఎంఏ నజ్కీ, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, సిద్థార్థ దవే, దామ శేషాద్రి నాయుడు, న్యాయవాది మోహిత్‌రావు హాజరయ్యారు.
తొలుత ఆర్యమ సుందరం తన వాదనలు వినిపిస్తూ... ‘‘కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దర్యాప్తు సంస్థ ఏసీబీని పర్యవేక్షించే హోంశాఖ కూడా ఆయన వద్దే ఉంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, దర్యాప్తు సంస్థల అధికారులను ఇంకా విచారించలేదు. అలాగే.. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌లో జరిగినర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై రేవంత్‌రెడ్డి బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. అదే వ్యక్తి తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తీరును పరిశీలిేస్త కేసుపై ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థమవుతుంది. గతంతో పోలిేస్త ప్రభుత్వం దాఖలు చేేస కౌంటర్ అఫిడవిట్లలోనూ కూడా వైఖరి మారింది’’ అని ఆర్యమ సుందరం తెలిపారు.
మరో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ తీరు, పోలీసు అధికారులతోపాటు సుప్రీంకోర్టుకు సంబంధించి రేవంత్‌రెడ్డి గతంలో చేసిన కొన్ని ప్రకటనల నేపథ్యంలో విచారణపై పిటిషనర్లలో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ... కేవలం అపోహలతో విచారణను బదిలీ చేేస్త మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున ఈ కేసు విచారణకు ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్‌ని నియమిస్తామని చెప్పారు. విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని స్పష్టం చేశారు.
2021 నుంచి ేస్ట అమలులో ఉండగా, 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు? అని పిటిషనర్ల తరఫున న్యాయవాదులను ప్రశ్నించారు. ‘‘మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి అనుమానాలను నివృత్తి చేేసందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తాం. ఏపీ లేదంటే తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తాం. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ని నియమిస్తాం. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం. ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకాన్ని సుప్రీంకోర్టే చేపడుతుంది’’ అని జస్టిస్ గవాయి చెప్పారు. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని, స్పెషల్ ప్రాసిక్యూటర్ నియామకంపై మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు ఇస్తామని తెలిపారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం విషయంలో వి.సురేందర్‌రావు(ప్రస్తుతం సీఎం కేసులో ప్రాసిక్యూటర్), ఉమా మహేశ్వర్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోని ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే.. విచారణ బదిలీ అంశాన్ని ప్రస్తుత స్థితిలో రద్దు చేయలేమని స్పష్టం చేసింది.
Updated Date - Aug 30 , 2024 | 02:49 AM