T. Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోరా?
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:19 AM
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు అన్నారు.
సమాధానం చెప్పలేక సర్కార్ పారిపోయింది: హరీశ్ రావు
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీ యూనియన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
కాగా, గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం 1:100 పద్ధతిలో నియామకాలు చేసిందని, ఇప్పుడు కూడా అదే విధానంలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు వినతిపత్రం ఇచ్చేందుకు అసెంబ్లీలోని ఆయన చాంబర్‌కు వచ్చిన హరీశ్ రావు.. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. సభలో ప్రశ్నించడం సభ్యుల హక్కు అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - Jul 25 , 2024 | 04:19 AM