Hyderabad Expansion: మహా హైదరాబాద్!
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:03 AM
ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్‌ను మహా నగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టిసారించిన సర్కారు.. విస్తరణను వేగవంతం చేసింది.
పురపాలికల్లో గ్రామాల విలీనం.. రూపు మారనున్న శివారు
మేడ్చల్ జిల్లాలో 23, రంగారెడ్డిలో11, సంగారెడ్డిలోనివి 11
సీఎం నిర్ణయంపై ఆసక్తి
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నార్సింగ్, పటాన్‌చెరు, ఆగస్టు 2: ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్‌ను మహా నగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టిసారించిన సర్కారు.. విస్తరణను వేగవంతం చేసింది. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)కు ఆనుకుని ఉన్న 45 గ్రామాలను సమీప పురపాలికల్లో విలీనం చేసే పక్రియను దాదాపు పూర్తి చేసింది. తర్వాత గ్రేటర్‌లో కలిపేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ ఊళ్లలో పంచాయతీ ఎన్నికలను నిలిపివేయనుంది. మొదట శివార్లలోని 44 పంచాయతీలనే ఎంచుకున్నా.. మరో గ్రామాన్ని జోడించారు. వీటిలో అత్యధికం మేడ్చల్ జిల్లా (23) పరిధిలో ఉన్నాయి.
ఏడు పురపాలికల్లో వీటిని విలీనం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని నాలుగు పురపాలికల్లో 11, సంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలికల్లో 11 గ్రామాలు కలిసిపోనున్నాయి. ఇవన్నీ ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా అనుకుని ఉన్న గ్రామాలే. పురపాలికల్లో విలీనమైన ఏడాదిలోగా గ్రేటర్‌లో చేర్చనున్నారు. దీంతో శివార్లలోని ఈ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. అయితే, పన్నుల విషయంలో ప్రజలకు భారం పడుతుంది. మరోవైపు హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మెయినాబాద్‌లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తున్నట్లు తెలిసింది. స్థానిక నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది.
సీఎం రేవంత్ చేతిలో..
కోకాపేట పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఎలా అభివృద్ధి జరిగింది..? తదితర విషయాలు ఆయనకు తెలుసు. స్థానిక రాజకీయ నేతలు, వ్యాపారులతో పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో కోకాపేట విషయంలో సీఎం మనసులో ఏముందన్నది తేలాల్సి ఉంది. కాగా, జీహెచ్‌ఎంసీలో పలు స్థానిక సంస్థలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రక్రియపై స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోకాపేట కథేమిటో?
ఓఆర్‌ఆర్ వరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ఓఆర్‌ఆర్ ఆవల ఉన్న కోకాపేటపై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆకాశ హర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు మహా నగరంలోని అత్యంత ఖరీదైన ఈ ప్రాంతం నార్సింగ్ మునిసిపాలిటీలో ఉంది. నార్సింగ్ మున్సిపాలిటీలో నార్సింగ్, మంచిరేవుల, వట్టినాగులపల్లి ఔటర్ లోపల.. కోకాపేట, ఖానాపూర్, గండిపేట వెలుపల ఉన్నాయి. దీంతో మునిసిపాలిటీ మొత్తాన్ని కొత్త కార్పొరేషన్‌లో విలీనం చేస్తారా? కోకాపేటను మాత్రమేనా..? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. బండ్లగూడ మున్సిపాలిటీలో బండ్లగూడ, కిస్మత్‌పూర్, హైదర్షాకోట్, పీరంచెరువు ఓఆర్‌ఆర్ లోపల, హిమాయత్‌సాగర్ బయట ఉంది. దీని పరిస్థితి ఏమిటన్నది కూడా తేలాల్సి ఉంది.
Updated Date - Aug 03 , 2024 | 03:03 AM