Police Operations: డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా!
ABN, Publish Date - Jul 18 , 2024 | 02:51 AM
రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దని, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
టాస్క్‌ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు
వరంగల్‌లో ప్రయోగాత్మకంగా.. బ్లాక్ స్పాట్‌లుగా గంజాయి, డ్రగ్స్ వినియోగ ప్రదేశాలు
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దని, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్)తోపాటు శాంతిభద్రతల పోలీసులు డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా జిల్లాలు, పోలీసు కమిషనరేట్ల పరిధిలో టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ తరహాలో డ్రగ్స్ కట్టడికి యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలను రంగంలోకి దింపుతున్నారు.
ఒక రిజర్వు ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో అవసరం మేరకు ఇద్దరు, ముగ్గురు ఎస్సైలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ టీమ్‌లను ఏర్పాటు చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకునేందుకు అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి.. అక్కడ యాంటీ డ్రగ్ కంట్రోల్ టీమ్‌లు తనిఖీలు చేస్తాయి. అలాగే గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలతోపాటు, విద్యాసంస్థలు, థియేటర్లు, ఇతర ప్రాంతాల్లో ఈ టీమ్‌లు నిరంతరం నిఘా కొనసాగిస్తాయి. ఆయా ప్రాంతాల్ని బ్లాక్ స్పాట్‌లుగా గుర్తిస్తారు.
అవసరాన్నిబట్టిస్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని దాడులు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారు. ఇక ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ తనిఖీల్లో పాల్గొన్న స్నిపర్ డాగ్స్ పోలీ్‌సలకు తనిఖీల్లో ఎంతో సహకారం అందించాయి. హైదరాబాద్‌లోని పబ్‌లపై దాడుల సమయంలోనూ రాష్ట్ర పోలీస్, టీజీ న్యాబ్ బృందాలు కె9 స్నిపర్ స్క్వాడ్ సేవల్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కె9 స్క్వాడ్ జాగిలాలు హెరాయిన్, కొకైన్, ఎండీఎంఏ వంటి అన్ని రకాల సింథటిక్ డ్రగ్స్‌ను ఒక గ్రాము కంటే తక్కువ మోతాదులో ఉన్నా, అవి ఎక్కడ దాచినా ఇట్టే వాసనతో పసిగట్టేస్తాయి.
డ్రగ్ అండ్ డ్రైవ్ పరీక్షలు!
డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చడంలో భాగంగా టీజీ న్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. పూర్తి స్థాయి డైరెక్టర్ నియామకంతోపాటు న్యాబ్ పనితీరును సీఎం స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. డ్రగ్స్ కట్టడి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని అందుకు తగ్గట్లుగా న్యాబ్ పనిచేస్తోందని డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఎవరివద్దనైన డ్రగ్స్, గంజాయి ఉన్నట్లు తెలిస్తే.. డయల్-100, 87126 71111 నెంబరుకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఇకపై హైదరాబాద్, శివారు ప్రాంతాలు, పబ్‌ల పరిసర ప్రాంతాల్లో డ్రగ్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Updated Date - Jul 18 , 2024 | 02:51 AM