Share News

Green Energy: పునరుత్పాదక విద్యుత్తుకు ప్రణాళికలను సిద్ధం చేయండి

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:15 AM

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు (గ్రీన్‌ ఎనర్జీ)ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెంటనే ప్రణాళికలను సిద్ధ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

Green Energy: పునరుత్పాదక విద్యుత్తుకు ప్రణాళికలను సిద్ధం చేయండి

  • గ్రీన్‌ఎనర్జీలో మహిళా సంఘాలు, రైతులకు భాగస్వామ్యం: భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు (గ్రీన్‌ ఎనర్జీ)ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెంటనే ప్రణాళికలను సిద్ధ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి పెంపుదల, వివిధ వర్గాలకు ఆదాయం సమకూర్చడంపై శుక్రవారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చులతో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా వచ్చే విద్యుత్తును పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.


దీనిద్వారా రైతులకు పంటలపై ఆదాయమే కాకుండా ప్రతి ఏటా సౌర విద్యుత్‌ ద్వారానూ ఆదాయం సమకూరుతుందన్నారు. దీంతోపాటు కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద గృహాలకు ప్రభుత్వ ఖర్చులతో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌ స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మధిర నియోజకవర్గంలోని సిరిపురంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 గ్రామాలను ఎంపిక చేసుకొని ముందుకుపోవాలని ఆదేశించారు. సౌర విద్యుత్‌తో ఆయా గ్రామస్తులకు ఆదాయాన్ని సమకూర్చడమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవడానికి వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించాలని సూచించారు. ఈ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.

Updated Date - Sep 14 , 2024 | 03:15 AM