ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: సాగు చేస్తేనే భరోసా

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:56 AM

రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకాన్ని వచ్చే జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటలు సాగు చేసేవారికే రైతు భరోసా ఇవ్వాలనేది తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు.

  • జనవరి నుంచే పెట్టుబడి సాయం

  • సాగు చేయనివారికి గత ప్రభుత్వం రూ.21,283 కోట్లు ఇచ్చింది

  • మేం అర్హులకే ఇస్తాం.. ఎవరికీ కోత పెట్టం

  • వర్షాకాలం నుంచి పంటల బీమా

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి

  • రైతుభరోసాపై శాసనసభ సభ్యుల సలహాలు కోరిన ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకాన్ని వచ్చే జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటలు సాగు చేసేవారికే రైతు భరోసా ఇవ్వాలనేది తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. సాగు చేసినా, చేయకపోయినా రైతుబంధు ఇచ్చారని తప్పుబట్టారు. శనివారం శాసనసభలో రైతుభరోసా పథకంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను చేపట్టింది. ఈ పథకంపై అన్ని పక్షాల అభిప్రాయాలను స్వీకరించింది. ఇప్పటిదాకా రైతు భరోసా అమలు జరిగిన తీరు, పీఎం కిసాన్‌ పథకం మార్గదర్శకాలు తదితర అంశాలపై ఒక పత్రాన్ని ప్రభుత్వం సభ ముందు ఉంచింది. సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌, బీజేపీ పక్ష ఉపనేత పాయల్‌ శంకర్‌, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, మజ్లిస్‌ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు ఈ పథకంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. కాగా, శాసనసభ్యులందరి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆ తర్వాత దీనిని మంత్రివర్గంలో చర్చించి, రైతు భరోసా విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి.. రైతుల, సహకార సంఘాల అభిప్రాయాలు తీసుకుందని చెప్పారు. అయితే ఈ పథకాన్ని ఎవరికి అమలు చేయాలి? ఎవరికి అమలు చేయకూడదనే నిర్ణయాలు ఇప్పటిదాకా తీసుకోలేదన్నారు. ఏయే పథకంలో ఏయే మార్గదర్శకాలు ఉన్నాయనేది మాత్రమే సభ్యులకు వివరిస్తున్నామన్నారు.


సాగు చేయకున్నా రూ.21,283 కోట్ల సాయం..

రైతుబంధు పథకం 2018-19లో ప్రారంభమయిందని, గత ప్రభుత్వం తొలి ఏడాది ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, 2019-20 నుంచి రూ.5 వేలకు పెచిందని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ఇప్పటిదాకా 12 సీజన్లకు కలిపి రూ.80,453.41 కోట్లను రైతుబంధు పథకం కింద రైతులకు ఇచ్చారని తెలిపారు. ధరణి పోర్టల్‌లో లభ్యమయ్యే భూమి రికార్డుల ఆధారంగా రైతులకు సాయాన్ని నిర్ణయించారని పేర్కొన్నారు. 2019-20లో 68.93 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయకపోయినా రైతుబంధు కింద రూ.3446.04 కోట్లు చెల్లించారన్నారు. 2020-21లోనూ పంట సాగు చేయని 88.50 లక్షల ఎకరాలకు రూ.4425.29 కోట్లు, 2021-22లో 82.61 లక్షల ఎకరాలకు రూ.4130.69 కోట్లు, 2022-23లో 88.12 లక్షల ఎకరాలకు రూ.4406.02 కోట్లు, 2023-24లో 97.51 లక్షల ఎకరాలకు రూ.4875.62 కోట్లు చెల్లించారని వివరించారు. మొత్తంగా ఆరేళ్లలో పంటలు సాగు చేయని భూములకే రూ.21,283.66 కోట్లు రైతుబంధు కింద చెల్లించారని వెల్లడించారు.


2018 ఏప్రిల్‌ 4న జారీ చేసిన జీవో నెం.231 ప్రకారం.. భూమిని సాగు చేస్తేనే ప్రయోజనాలు కల్పించాలని స్పష్టంగా ఉందని, అయినా అమలులో వ్యత్యాసం కనిపిస్తోందని గుర్తు చేశారు. 2018-19లో సాగు చేసిన, సాగు చేయని భూములు మొత్తం 262.16 లక్షల ఎకరాలకు రెండు పంటకాలాలకు కలిపి రూ.10,486.36 కోట్లను రైతుబంధు కింద గత ప్రభుత్వం ఇచ్చిందని తుమ్మల తెలిపారు. ఆ తర్వాత 2019-20లో మొత్తం 210.64 లక్షల ఎకరాలకు రూ.10,532.02 కోట్లు, 2020-21లో 293.13 లక్షల ఎకరాలకు రూ.14,652.02 కోట్లు, 2021-22లో రూ.14,772.94 కోట్లు, 2022-23లో 294.88 లక్షల ఎకరాలకు రూ.14,743.02 కోట్లు, 2023-24లో 305 లక్షల ఎకరాలకు రూ.15,263.05 కోట్లు ఇచ్చారని మంత్రి తుమ్మల వివరించారు. మొత్తంగా 12 సీజన్లకు కలిపి రూ.80,453.41 కోట్లు ఇచ్చారని చెప్పారు. అటవీ హక్కుల రక్షణ చట్టం (ఆర్‌వోఎ్‌ఫఆర్‌) పట్టాలు ఉన్న రైతులకు కోత పెడతామని తాము చెప్పలేదన్నారు. 2023-24లో రైతు భరోసా కింద తాము ఒకేరోజు రూ.7628 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామన్నారు.


పీఎం కిసాన్‌కు అర్హులు వీరే..

పీఎం కిసాన్‌ పథకం మార్గదర్శకాలనూ శాసనసభలో మంత్రి తుమ్మల వివరించారు. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.6 వేల సహాయాన్ని మూడు విడతలుగా అందించారని తెలిపారు. కుటుంబం అంటే తండ్రి లేదా తల్లి, మైనర్‌ పిల్లలుగా నిర్వచించారన్నారు. 2019 ఫిబ్రవరి 1 నాటికి భూమి యాజమానిగా ఉన్న రైతుకే పీఎం కిసాన్‌ అమలవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ ఉద్యోగులు (జీతాలు పొందేవారు , పెన్షనర్లు) పీఎం కిసాన్‌ పథకాన్ని అర్హులు కాదన్నారు. వీరే కాకుండా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు (గత ఐదేళ్ల నుంచి కనీసం మూడేళ్లలో వరుసగా రెండేళ్లపాటు పన్ను చెల్లింపుదారులుగా ఉన్నవారంతా), వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, నిపుణులు కూడా ఈ పథకానికి అర్హులు కాదని మంత్రి పేర్కొన్నారు.


రైతు భరోసాపై సలహాలివ్వండి

  • వర్షాకాలం నుంచి పంటల బీమా

  • శాసనసభలో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : రైతు భరోసా విఽధి విధానాలపై ఎమ్మెల్యేలు ఇంకా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని, మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా విధివిధానాలపై శనివారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అధికార, విపక్షాలకు సంబంధించిన సభ్యులంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సభ ముగిసినా ఈ విషయంలో ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా ఇస్తామన్నారు. వచ్చే వర్షాకాలం నుంచే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సబ్సిడీలు, వ్యవసాయ యాంత్రికీకరణను తిరిగి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాను 15 ఎకరాల వరకే పరిమితం చేస్తే బాగుంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. గత సర్కారు హయాంలో సాగు చేయని 45 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చారని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు.

Updated Date - Dec 22 , 2024 | 03:58 AM