మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం!
ABN , Publish Date - May 07 , 2024 | 05:54 AM
మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) కమిటీ తేల్చిచెప్పింది. 2019 వరదల
బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే
తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ
డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి
తెలంగాణ సర్కారుకు నివేదికహైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) కమిటీ తేల్చిచెప్పింది. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్‌డీఎ్‌సఏ కమిటీ సోమవారం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని తేల్చిచెప్పింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా మేడిగడ్డ డిజైన్లతో నిర్మించడం వల్ల వాటిలోనూ వైఫల్యాలున్నాయని, ఆయా బ్యారేజీల్లో సీపేజీల నివారణకు ప్రత్యేక కాంక్రీట్‌తో ట్రీట్‌మెంట్ చేయాలని సూచించింది. ఇక వర్షాకాలంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరద పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత మేడిగడ్డలో షీట్‌పైల్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత మేడిగడ్డలోని బ్లాక్-7ను పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో కొత్త బ్లాకు కట్టాలని... ఏడో బ్లాకులో దెబ్బతిన్న గేట్ల సీల్‌లను తొలగించి గేట్లను మాన్యువల్ విధానంలో ఎత్తాలని సూచించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తైన ఏడాది నుంచే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టలేదని, 2019లో నవంబరులోనే వరదల తర్వాత గేట్లు మూయగానే ఈ బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయని కమిటీ పేర్కొంది. డౌన్‌స్ట్రీమ్, అప్‌స్ట్రీమ్ అఫ్రాన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. సీసీ బ్లాకులు కూడా కొట్టుకుపోయాయని, బ్యారేజీల నిర్మా ణం పూర్తైనా కాఫర్ డ్యామ్, షీట్ ఫైల్స్ శిథిలాలు యథాతథంగా ఉన్నాయని... ఇవి కూడా వరద ప్రవాహానికి అడ్డుపడి బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమయ్యాయని పేర్కొంది. మరమ్మతుల అనంతరం మేడిగడ్డ బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వలు చేయవద్దని, పంప్‌హౌ్‌సలకు నీరందేలా హెడ్‌లకు నీరు (పంపింగ్ చేయడానికి నీరు దొరికేదాకా) అందే వరకే నీటి నిల్వ చేయాలని కమిటీ సూచించింది. ఇతర బ్యారేజీల్లో కూడా పూర్తిస్థాయి నీటినిల్వ ఏ మాత్రం క్షేమదాయకం కాదని పేర్కొం ది. మేడిగడ్డ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.87 టీఎంసీలు, సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఎంసీలుగా ఉంది.