Hyderabad: కామర్స్ వైపు మొగ్గు ..
ABN, Publish Date - Jun 07 , 2024 | 03:56 AM
దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 76,290 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వీరిలో 58,920 (77.23 శాతం) మంది కామర్స్, లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులనే ఎంపిక చేసుకున్నారు.
‘దోస్త్’లో 38శాతం విద్యార్థుల ప్రాధాన్యత దీనికే..
తర్వాతి స్థానాల్లో లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులు
తొలి విడతలో 76,290 మందికి ప్రవేశాలు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 76,290 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వీరిలో 58,920 (77.23 శాతం) మంది కామర్స్, లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులనే ఎంపిక చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా 28,655 (37.56 శాతం) మంది కామర్స్ గ్రూపులో ప్రవేశాలు పొందారు. లైఫ్ సైన్స్‌లో 15,301 (20.03 శాతం), ఫిజికల్ సైన్స్‌లో 14,964 (19.61శాతం) మంది చేరారు. ఆర్ట్స్‌లో 7,766 (10.18ు), డేటా సైన్స్/ఏఐ/ఎంఎల్‌లో 2,502 (3.28ు), డీఫార్మసీలో 90 (0.12ు), ఇతర కోర్సుల్లో 7,012 (9.19ు) మంది ప్రవేశాలు పొందారు. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత ప్రవేశాల భర్తీ ప్రక్రియ ముగియడంతో ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులు గురువారం విడుదల చేశారు.
తొలి విడతలో 1,04,784 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 81,769 మంది వెబ్ ఆప్షన్లను పొందారు. 76,290 మందికి ప్రవేశాలను కేటాయించారు. 55,124 మంది తొలి ప్రాధాన్యతలోనే సీట్లు పొందగా.. 21,166 మంది రెండో ప్రాధాన్యతలో పొందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ప్రవేశాలు పొందిన వారిలో 72,431 ఇంగ్లిష్ మాధ్యమ విద్యార్థులుండగా.. తెలుగు మాధ్యమం 3,314, ఉర్దూ మాధ్యమం 540, హిందీ మాధ్యమం ఐదుగురున్నారు. దోస్త్ ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి ర్యాంక్‌ను తమ్మ అలేఖ్య (99.40ు) సాధించారు. ఈమె తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (కోఠి మహిళా కాలేజీ)లో లైఫ్ సైన్స్‌లో ప్రవేశం పొందారు. కడం అంకిత (99.30ు), బానోతు అంజలి (99.30ు) రెండు, మూడు ర్యాంకులు సాధించగా వీరు నిజాం కాలేజీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఫిజికల్ సైన్స్‌లో ప్రవేశం పొందారు. టాప్-10 ర్యాంకుల్లో 9 మంది బాలికలే ఉండటం విశేషం. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 886 డిగ్రీ కాలేజీల్లో 546 కోర్సులు, 3,84,748 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతలో 70 కాలేజీల్లో ఒక్క ప్రవేశం కూడా జరగలేదు. మొదటి విడతలో ప్రవేశాలు పొందినవారు ఈనెల 12లోపు రూ.500 లేదా రూ.1,000 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ రుసుము చెల్లించి సీటును ఖరారు చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దు చేస్తామన్నారు. రెండో విడత రిజిస్ట్రేషన్ గురువారం నుంచి ప్రారంభమైందని, ఇది ఈ నెల 14వరకు కొనసాగుతుందని.. 18న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
Updated Date - Jun 07 , 2024 | 03:56 AM