ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

ABN, Publish Date - May 21 , 2024 | 04:17 AM

: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

  • 500 చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్‌ నుంచే అమలు.. కేబినెట్‌ భేటీలో నిర్ణయం

  • కాళేశ్వరంలో చుక్క నీటి నిల్వ సాధ్యం కాదు

  • ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక మేరకే చర్యలు

  • తాత్కాలిక ఏర్పాట్లతో రైతులకు నీటి సరఫరా

  • తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తాం

  • అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం

  • నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

  • జూన్‌ 2న సోనియాగాంధీకి అభినందన సభ

  • మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన

  • పొంగులేటి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ధాన్యం కొనుగోళ్లు, తడిసిన ధాన్యం సేకరణ, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లింపు, పాఠశాలల్లో సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం రాత్రి విలేకరులకు వివరించారు. కేబినెట్‌ భేటీలో ప్రధానంగా రైతుల పంట కొనుగోళ్లు, పాఠశాలల్లోని సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్‌ ఎన్‌డీఎ్‌సఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, సంక్షేమ హాస్టళ్లు, రూ.2కే కిలో బియ్యం పథకాలకుగాను రాష్ట్రంలో ఏటా 36 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరముంటాయని మంత్రి పొంగులేటి తెలిపారు. పైగా ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ సన్నబియ్యాన్ని బయటి ప్రాంతాల నుంచి కొనకుండా రాష్ట్రంలోని రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున ఈ సీజన్‌ నుంచే బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.


తడిసిన ధాన్యానికీ కనీస మద్దతు ధర..

రాష్ట్రంలో ఈసారి పండించిన పంటలో ఇప్పటివరకు 36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించిందని, ఈ ధాన్యానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజానికి దేశంలో పౌరసరఫరాల సంస్థల ద్వారా ఇంత తొందరగా ధాన్యాన్ని సేకరించిన దాఖలాలు ఎప్పుడూ లేవన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా.. మూడు రోజుల్లోనే డబ్బు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక గతంలో ఎప్పుడూ లేనివిధంగా పది రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా కొంత ధాన్యం తడిసిందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, దీనిని కూడా మద్దతు ధరకే కొనాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. ఇక ఇప్పటికే వానాకాలం సీజన్‌ ప్రారంభమైందని, విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నకిలీ విత్తనాలు సృష్టించేవారు, అమ్మేవారు, నకిలీ రసీదులు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రైతులు కూడా అధికారికంగా కంపెనీల వద్దే విత్తనాలను కొనాలని, ఆ రసీదులను పంట పూర్తయ్యేవరకు ఉంచుకోవాలని సూచించారు. కాగా, జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నందున వాటిలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.600 కోట్లను కేటాయించిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటికే రూ.120 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చినట్లు తెలిపారు. స్కూళ్ల పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు.


బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచవద్దన్న ఎస్‌డీఎ్‌సఏ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల్లోనూ ప్రస్తుతానికి నీటిని నిల్వ చేయరాదని మంత్రివర్గం నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. ఈ బ్యారేజీల్లో చుక్క నీటిని కూడా నిల్వ చేయడానికి వీల్లేదంటూ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) చెప్పినందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే రైతు ప్రయోజనాల దృష్ట్యా ర్యాక్‌ ఫిల్‌ డ్యామ్‌ను ఏర్పాటు చేసి, నీటిని సరఫరా చేసే తాత్కాలిక ఏర్పాట్లపై పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్‌డీఎ్‌సఏ చెప్పినట్లుగానే నడుచుకోవాలని, నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎ్‌సఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో మూడు అంశాలను స్పష్టంగా పేర్కొన్నదని అన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లీకేజీలు ఉన్నాయని, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉందని కమిటీ చెప్పిందని తెలిపారు. ఈ మూడు బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచాలి తప్ప.. ఏ బ్యారేజీలోనూ చుక్క నీటిని కూడా నిల్వ చేయవద్దని సూచించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతు చేసినా, నిధులు వ్యయం చేసినా.. ఆ బ్యారేజీ ఉంటుందో, లేదో తాము చెప్పలేమని తెలిపిందని వెల్లడించారు. డ్యామ్‌ సేఫ్టీ పరీక్షలను ఒకే కంపెనీతో కాకుండా మూడు కంపెనీలతో చేయించాల్సిందిగా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు కంపెనీలను కమిటీ సూచించిందని తెలిపారు. ఈ మూడింటిలో రెండింటి అభిప్రాయాలు తీసుకుని బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు వృథా పోకుండా ఉండడానికి నిపుణుల సూచనల మేరకు తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా నీటిని ఇవ్వాలన్నదే ప్రభుత్వ యోచన అని స్పష్టం చేశారు.


కాళేశ్వరం రిపేర్లు కాంట్రాక్టు సంస్థే చేస్తుంది

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టు సంస్థదే బాధ్యత అని, మరమ్మతులను ఆ సంస్థే చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. ఎల్‌అండ్‌టీకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన విషయంలో తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మేడిగడ్డ నుంచి పంపింగ్‌ సాధ్యం కాకపోతే... రైతులను ఇబ్బంది పెట్టడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, ఇదే అంశంపై కేబినెట్‌లో చర్చించామని అన్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ విషయంలో పేద, మధ్య తరగతి కుటుంబాలవారికి అండగా నిలవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూతపడిన 6వేల పాఠశాలలను తిరిగి తెరిచే ఆలోచన చేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎంను ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా... అందరినీ ఆహ్వానిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.


సోనియాకు అభినందన సభ

సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి జూన్‌ 2 నాటికి పదేళ్లు పూర్తవుతున్నందున.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఆమెను అభినందించాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతోపాటు రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన పెద్దలందరినీ పిలిచి బహిరంగ సభలో సన్మానించాలని, ఇందుకు అనుమతి కోసం ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించామని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటైదని, ప్రతిపక్షానిది మొసలి కన్నీరు మాత్రమేనని వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి వ్యవసాయం, విద్య, ప్రజలకిచ్చిన వాగ్దానాలే ప్రాధాన్య అంశాలన్నారు. ఒక్క గింజ కూడా తరుగు లేకుండా, రైతులు గత దశాబ్ద కాలంలో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణను కొనసాగిస్తున్నామన్నారు. మార్కెట్‌లోకి వచ్చిన పంటను కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విస్మరించిందని, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య విషయంలో రాబోయే కాలంలో మార్పును చూపించాలని తాము నిర్ణయించామని చెప్పారు. రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులను తయారు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, తాను ఏం మాట్లాడాలన్నా జూన్‌ 5న మాట్లాడతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రైతులపై ఏ ప్రభుత్వానికి ప్రేమ ఉందో అందరికీ తెలుసునన్నారు. ధర్నాల పేరిట ఎవరు ఎన్ని నాటకాలాడినా.. తమ నల్లగొండ జిల్లాలో 99.9 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు. భువనగిరి, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా సేకరణ నిలిచిపోయిందని, దీనిని వారం రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గత ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలను ఆరేడు విడతలుగా అమలు చేసిందని, తాము ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో 5600 పాఠశాలలు మూత పడ్డాయని, ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. విద్యారంగంలో రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ను పెట్టిన ఇందిరమ్మ ప్రభుత్వం ఇది అని చెప్పారు.

Updated Date - May 21 , 2024 | 04:17 AM

Advertising
Advertising