Jaggareddy: నెహ్రూ 3259 రోజులు జైల్లో గడిపారు..
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:08 AM
‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్‌లాల్ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’
దేశం కోసం మోదీ కొన్ని గంటలైనా జైలుకెళ్లారా?.. బీజేపీ నేతలు చెప్పాలి
నెహ్రూ, ఇందిరల గురించి మాట్లాడే నైతికత వారికి లేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్‌లాల్ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. బీజేపీ నేతలను నిలదీశారు. దీనికి వారు సమాధానం చెప్పాలన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పుట్టుకతోనే ధనవంతుడైన నెహ్రూ.. ప్రజల కోసం సొంత ఆస్తులను దారాదత్తం చేశారని, దేశానికి ప్రధాని అయినప్పటి నుంచీ సొంత ఇల్లూ లేకుండా.. ప్రభుత్వ క్వార్టర్‌లోనే నివాసం ఉన్నారని పేర్కొన్నారు. ఆయన తర్వాత ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీలూ ప్రభుత్వ క్వార్టర్లలోనే నివాసం ఉన్నారన్నారు. సొంత ఆస్తులను దేశం కోసం దారాదత్తం చేసిన చరిత్ర నెహ్రూ కుటుంబానిదైతే.. ప్రభుత్వ క్వార్టర్‌నూ గుంజుకుని రాహుల్‌గాంధీని బయటకు పంపిన చరిత్ర మోదీదని విమర్శించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా నెహ్రూ, ఇందిరాగాంధీల గురించి లేనివి.. ఉన్నట్లుగా చెప్పించే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గాంధీ నాయతకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నెహ్రూని ప్రధానిగా ఎన్నుకుందని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. బ్రిటిషర్ల తరహాలో రాచరిక పాలనను కొనసాగించే అవకాశం ఉన్నా.. ఎన్నికలు, ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని నెహ్రూ తీసుకువచ్చారన్నారు. ఇవాళ బీజేపీ నేతలు పార్లమెంటులో ప్రసంగాలు చేస్తున్నారంటే.. ఆ స్వేచ్చను కల్పించింది నెహ్రూనే అన్న సంగతి వారు మరవద్దన్నారు. ‘‘అంబేడ్కర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ బీజేపీ నేతలు మరో దుష్ప్రచారం చేస్తున్నరు. మోదీ, అమిత్‌షా సహా ఇప్పుడున్న బీజేపీ నేతలు ఎవరైనా అప్పుడు ఉన్నారా? ఆ రోజున ఉన్న వాజ్‌పేయి, ఆడ్వాణీలు.. అంబేడ్కర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఎన్నడైనా మాట్లాడారా?’’ అని నిలదీశారు. ఇప్పుడున్న తరానికి చరిత్ర తెలుస్తలేదని, మోదీ.. అమిత్‌షాలు మాట్లాడిందే నిజమనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఏ కారణాలతో ఓడారో ఎవరికీ తెలియదు కానీ.. ఓడిన తర్వాతా అంబేడ్కర్‌ను ఎంపీని చేసి న్యాయశాఖ మంత్రిని చేసిన చరిత్ర నెహ్రూదని తెలిపారు.
అలాగే రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతనూ ఆయనకు అప్పగించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ ఖూనీ చేశారని మాట్లాడుతున్న బీజేపీ నేతలకు ఈ మాత్రం జ్ఞానం లేకపోవడం బాధాకరమని విమర్శించారు. ఇందిరాగాంధీ తీసుకొచ్చిన గరీభీ హఠావో.. రోటీ, కపడా, మకాన్ నినాదమూ భూటకమంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతలు గ్రామాలకు వెళ్లి చూస్తే ఆనాడు పేదలకు ఇందరమ్మ ఇచ్చిన ఇళ్ల జాగాలు, ఇళ్లు ఇప్పటికీ కనిపిస్తాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 420 సీట్లు ఇవ్వాలని ప్రజలను మోదీ కోరితే.. 240 మాత్రమే ఇచ్చారని, పవన్ కల్యాణ్, టీడీపీ మద్దతు లేకుంటే ఆ పార్టీ ప్రభుత్వం ఎగిరి పోయి ఉండేదని అన్నారు. నెహ్రూ, ఇందిరల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ఇందిర, రాజీవ్‌గాంధీలు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారని, తమ ప్రాణాలకూ ఎక్కడి నుంచైనా ముప్పు రావచ్చని తెలిసినా.. ప్రజా సమస్యల కోసం వారి వద్దకు వెలుతున్న నాయకులు రాహుల్, ప్రియాంకలు అని జగ్గారెడ్డి కొనియాడారు.
Updated Date - Jul 06 , 2024 | 04:08 AM