Share News

Congress: టీపీసీసీ సారథి మహేష్‌కుమార్‌ గౌడ్‌?

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:32 AM

టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేరు వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

Congress: టీపీసీసీ సారథి మహేష్‌కుమార్‌ గౌడ్‌?

  • ఆయన వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు

  • పోటీ ఇస్తున్న మధుయాష్కీగౌడ్‌

  • రేపు ప్రకటన వెలువడే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేరు వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ గట్టి పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేతనే నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మధు యాష్కీ గౌడ్‌లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తుది కసరత్తులో ఉన్నట్లు సమాచారం. కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల పీసీసీలతో పాటుగా టీపీసీసీకీ నూతన అధ్యక్షుడిని సోమవారం ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోది.


టీపీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం అధిష్ఠానం పెద్దలు.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ఇటీవల ముగ్గురినీ ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్ఠానం.. వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌ , ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభాను ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలా? లేక ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతను నియమించాలా? అన్న దానిపై అధిష్ఠానం వద్ద తర్జన భర్జన నడిచింది.


దేశవ్యాప్తంగా ఒక సందేశం ఇవ్వడానికి ఎస్టీ లంబాడా వర్గం నుంచి ఎంపిక చేయాలన్న ప్రతిపాదనా రాష్ట్ర నేతల నుంచి వచ్చింది. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మధు యాష్కీ, ఎంపీ సురేష్‌ షెట్కార్‌, మాజీ ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, వి.హన్మంతరావు తదితర పేర్లు చర్చలోకి వచ్చాయి. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ కుమార్‌ పేర్లు పరిశీలించారు. ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్‌ పేరు ప్రతిపాదనలో ఉంది. సీఎం రేవంత్‌, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల అభిప్రాయాలు తీసుకున్న అధిష్ఠానం.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.


బీసీ నేతల్లో వడపోతల తర్వాత మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మధు యాష్కీల పేర్లు తుది పరిశీలనలో నిలిచాయి. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మహేష్‌ కుమార్‌ టీపీసీసీ సంస్థాగత అంశాలూ చూస్తున్నారు. విద్యార్థి దశ నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం.. ప్రస్తుతానికైతే మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం వద్ద విశ్వాసపాత్రుడిగా పేరున్న మధు యాష్కీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎవర్ని ఎంచుకోవాలనే విషయమై అధిష్ఠానం ఫ్లాష్‌ సర్వేలూ నిర్వహించినట్లు చెబుతున్నారు.


కాంగ్రెస్‌ సంస్కృతిలో భాగంగా ఇరువురు నేతల మద్దతుదారులు అధిష్ఠానానికి పరస్పరం ఫిర్యాదులు ఇచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని టీపీసీసీ నూతన అధ్యక్షుడిపై అధిష్ఠానం తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్‌, యాష్కీలో అధిష్ఠానం ఎవరిని ఎంచుకుంటుంది? లేక ఇంకో పేరు తెరపైకి వస్తుందా అన్న చర్చా పార్టీలో నడుస్తోంది. టీపీసీసీకి అధ్యక్షుడిని మాత్రమే ప్రకటించి.. కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం తీసుకునేందుకు అధిష్ఠ్ఠానం మరికొంత సమయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - Sep 01 , 2024 | 03:32 AM