ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బీజేపీతో కలిసింది బీఆర్‌ఎస్సే..

ABN, Publish Date - Jul 25 , 2024 | 03:56 AM

‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్‌ఎస్‌ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది.

  • వారికి రాష్ట్రం కంటే రాజకీయాలే ముఖ్యం

  • కేంద్ర ప్రభుత్వ వివక్షపై తీర్మానం చేద్దామంటే భయపడుతున్నారు: భట్టి

  • పోరాటానికి బీజేపీ కలిసి రావాలి:దుద్దిళ్ల

  • రాష్ట్ర బీజేపీ నేతలకు డీఎన్‌ఏ టెస్టు!

  • వారిలో తెలంగాణ పౌరుషముందా?: పొన్నం

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్‌ఎస్‌ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది. బీజేపీతో కలిసింది బీఆర్‌ఎస్సే’’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం శాసనసభలో పెట్టిన చర్చకు ప్రతిపక్షాల నుంచి ఆశించిన మేరకు మద్దతు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కారు, కమలం పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భట్టి విమర్శించారు.


వెనకబడ్డ తెలంగాణ అభివృద్ధి కోసమే నాటి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విభజన చట్టాన్ని తీసుకొచ్చారని భట్టి గుర్తుచేశారు. ఆ చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిననిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. చర్చ జరిగే అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సభా నాయకుడికి అనుభవం లేదంటూ అవహేళన చేయడం కేటీఆర్‌కు సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు అన్ని పక్షాలు ప్రభుత్వంతో కలిసి వచ్చి తీర్మానాన్ని ఏకీభవించాలని విజ్ఞప్తి చేశారు.


బీజేపీ ఎల్పీ నేతకు హరీశ్‌ చిట్టీలందిస్తున్నారు

పదేళ్లపాటు అధికారంలో ఉండి బీజేపీతో అంటకాగింది బీఆర్‌ఎస్సేనని భట్టి విమర్శించారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చిట్టీలు అందించారన్నారు. అలాంటి నేతలు తాము బీజేపీతో కలిశామని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్న దానికే తాము కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేస్తే పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు.


కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఇవ్వనందుకు సీఎం, మంత్రులందరూ సచ్చేదాకా ఆమరణ దీక్ష చేయాలన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. దేశంలో తెలంగాణ భాగం కాదా? రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాలను కేటాయించరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం జరిగే పోరాటానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి రావాలని కోరారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో మోదీ సర్కారు రాష్ట్రం పట్ల అత్యంత వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బడ్జెట్‌ ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదన్నారు.


తెలంగాణ పౌరుషముందా?: పొన్నం

రాష్ట్ర బీజేపీ నేతల్లో తెలంగాణ పౌరుషం ఉందో లేదో డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీజేపీ నేతలు బానిసల్లా బతుకుతున్నారని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేని ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఎలా అడుగుపెడతారని ఆయన ప్రశ్నించారు. ఉద్వేగంతో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి తన సీటు నుంచి వచ్చి మంచినీళ్ల బాటిల్‌ అందించారు. దాంతో తమకు మంచినీళ్లు కాదని, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని పొన్నం చమత్కరించారు.


సభ నుంచి బీజేపీ సభ్యుల వాకౌట్‌

కేంద్ర నిధులను తీసుకొని కూడా ఏం రాలేదని పదేపదే కాంగ్రెస్‌ చెప్పడం సరికాదని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెడుతున్న తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ పలుమార్లు వెల్‌లోకి వెళ్లారు. స్పందించిన స్పీకర్‌.. ఇదేమీ మండల, జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కాదని, కొత్త ఎమ్మెల్యేలు జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించారు.

Updated Date - Jul 25 , 2024 | 03:56 AM

Advertising
Advertising
<