ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGPSC: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది!

ABN, Publish Date - Jul 08 , 2024 | 04:07 AM

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్‌ అధికారులు వెల్లడించారు.

  • గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు

  • ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు

  • ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి.. అక్టోబరు 21 నుంచి 27 దాకా మెయిన్స్‌

  • మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్‌ అధికారులు వెల్లడించారు. ఫలితాలను ఆదివారం కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో భాగంగా జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. జూన్‌ 24న ప్రాథమిక కీని విడుదల చేశారు. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ఆదివారం తుది కీని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఫలితాలను కూడా వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


ఈ నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు 28,150 మంది ఎంపిక కావాల్సి ఉంది. అయితే.. 1:50 నిష్పత్తిలో కొన్ని ప్రత్యేక రిజర్వేషన్‌ కేటగిరీల్లోని పోస్టులకు అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మెరిట్‌ జాబితాలోని ఇతర అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. రిజర్వేషన్‌ పోస్టుల భర్తీ కోసం కటాఫ్‌ మార్కుల కంటే దిగువ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనివల్ల పోస్టుల సంఖ్య, ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్‌ మార్కుల జాబితాను పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు కమిషన్‌ అధికారులు ప్రకటించారు.


మూడు సార్లు..!

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ విషయంలో అనేక సంవత్సరాలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలను రెండు సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. మొదటిసారి ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో రద్దు చేశారు. రెండోసారి పరీక్ష నిర్వహణలో నిబంధనలను పాటించలేదన్న కారణంగా కోర్టు రద్దు చేసింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. అంటే.. గ్రూపు-1 పోస్టుల కోసం అభ్యర్థులు మూడుసార్లు ప్రిలిమినరీ పరీక్షలను రాశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు లోపు గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. కాగా, గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబరులో జరిగే మెయిన్స్‌ పరీక్షలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించలేని వారు నిరుత్సాహపడొద్దని సీఎం తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.


గ్రూపు-2 పరీక్షలు వాయిదా?

ఇక గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జులై 17 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలు పూర్తయిన వెంటనే.. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూపు-2 పరీక్షలు ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు ఈ రెండు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. దీంతో గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 04:07 AM

Advertising
Advertising
<