Tummala: సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తాం
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:29 AM
రైతు భరోసాపై శాసనసభ, శాసనమండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బును రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతులు ఉద్యాన పంటలూ పండించాలి: మంత్రి తుమ్మల
రాజేంద్రనగర్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాపై శాసనసభ, శాసనమండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బును రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసాపై ఇప్పటికే మేధావులు, నిపుణులతో చర్చించామన్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకల్లో శుక్రవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరినే కాకుండా అధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను పండించాలని సూచించారు. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ... ఆయిల్‌పామ్‌లోనూ అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. 60ఏళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని తెలిపారు.
ఏఐ, పరిజ్ఞానాన్ని వ్యవసాయంలోకి తీసుకురావాలి: గవర్నర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ శాస్త్రవేత్తలు, విద్యార్థులకు సూచించారు. 2047నాటికి వ్యవసాయ రంగంలో ఈ విశ్వవిద్యాలయం ప్రపంచస్థాయికి ఎదగాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్‌మేళాను మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అమెరికాలోని కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పీవీ వరప్రసాద్‌కు గవర్నర్ చేతుల మీదుగా గుర్తింపు పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 32 వేల మంది వ్యవసాయ పట్టభద్రులు బయటకు వచ్చారన్నారు.