Bhupalapalli: తొందరపాటు వల్లే..
ABN, Publish Date - Jun 24 , 2024 | 03:06 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?
మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం?.. పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాతర
రాజకీయ ప్రయోజనం కోసం హడావుడి చర్యలు!
నిర్మాణ పనుల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
ఏడాదిపాటు లీకేజీలపై నిర్లక్ష్యం.. నిర్వహణ గాలికి
అండర్ కరెంట్ ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు
కీలక పనులకు సంబంధించి దేనికీ లేని రికార్డులు
భూపాలపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో జియో ఫిజికల్ సర్వేలను విస్మరించారని, జీఎ్‌సఐ సర్వే చేయించలేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రాచుర్యం పొందిందని, అక్కడ అంతర్వాహిని ప్రవహిస్తోందని చాలా మంది విశ్వసిస్తున్నారని, కానీ.. అక్కడ ఆ అంతర్వాహిని ఉందా? లేదా? అన్న విషయాన్ని తేల్చలేదని గుర్తుచేస్తున్నారు.
బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల్లో 100 మీటర్ల లోతు వరకు భూభౌతిక స్థితిగతుల డాటాను సేకరించాల్సి ఉండగా కేవలం 25 మీటరక్లే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు మూడింటి జీఎ్‌సఐ డాటా అందుబాటులో లేదని చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోయేందుకు చిన్న చిన్న లీకేజీలే పెను విపత్తుకు కారణమని ఎన్‌డీఎ్‌సఏ ప్రాథమికంగా పరీక్షల్లో తేల్చినా.. ఏడాది కాలంపాటు నిర్వహణను నిర్లక్ష్యం చేశారని చెబుతున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాల్లోస్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అనుసరించలేదని అన్నారు.
పనుల్లో డిజైన్లను అనుసరించినా..
బ్యారేజీల నిర్మాణ సమయంలో డిజైన్లను అనుసరించి పనులు చేపట్టినా.. కొన్ని కీలకమైన సాంకేతిక అంశాలను విస్మరించారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యారేజీల ఫౌండేషన్ సందర్భంగా ఫైల్స్, రాఫ్ట్‌ల నిర్మాణం సమయాల్లో నిర్ధారిత ప్రమాణాలు పాటించలేదని అంటున్నారు. ఫైల్స్ ఏర్పాటు సందర్భంగా లీకేజీలు ఏర్పడకుండా బెంటోనైట్ కెమికల్‌తో వాటర్ ప్రూఫ్ చేయాల్సి ఉన్నా దానిని సరిగ్గా చేయలేదని పేర్కొంటున్నారు. కటాఫ్ ఫైలింగ్ నిర్మాణ సమయంలో ఒకదానిపై మరో ఫైల్ వేసేటప్పుడు పగుళ్లు ఏర్పడతాయని, ఆ పగుళ్లను బెంటోనైట్ కెమికల్‌తో పక్కాగా ప్రూఫింగ్ చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. కానీ, వాటిని సరిగ్గా చేశారా? లేదా? అని చెప్పేందుకు సరైన డేటా రికార్డులు కూడా అందుబాటులో లేవంటున్నారు. ఇక్కడ ఏమాత్రం గ్యాప్ ఉన్నా సకాలంలో గుర్తించకపోతే అదే పెను విపత్తుకు దారి తీస్తుందని, మేడిగడ్డ బ్యారేజీలో అదే జరిగిందని అంటున్నారు.
దీంతోపాటు బ్యారేజీలో అంతర్గత ప్రవాహం (అండర్ కరెంట్ ఫ్లో) తీవ్రత అధికంగా ఉంటుందని, ఇసుక మధ్యలోనుంచి చిన్నగా మొదలయ్యే లీకేజీని పట్టించుకోకపోతే లీకేజీల తీవ్రత పెద్దగా మారి బ్యారేజీ పియర్ల బరువు కారణంగా ఫౌండేషన్ కుంగిపోతుందని, మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో అదే జరిగిందని చెబుతున్నారు. ఇన్నాళ్లు ఇసుక ఉండటం వల్ల సింక్ హోల్స్ కనిపించకుండా పోయాయని, తాజాగా పరీక్షల కోసం ఇసుక తీసివేయడం వల్ల ఆ రంధ్రాల తీవ్రత బయట పడిందని అన్నారు. ఇక బోర్ హోల్స్ వేసిన ప్రదేశంలోనే బ్యారేజీలు నిర్మించారా? లేదా? అని చెప్పేందుకు కూడా అవసరమైన సమాచారం లేదన్నారు. ముఖ్యంగా బోర్ హోల్స్ వేసినప్పుడు రాతి అవశేషాలను నిల్వ చేసే పరిస్థితి ఉంటుందే తప్ప ఇసుక ప్రాంతం కావడం వల్ల అక్కడ ఏం జరిగిందో చెప్పేందుకు ఆధారాలు లేని పరిస్థితిని సృష్టించారని చెప్పారు.
క్లిష్టతరమే.. అయినా పునరుద్ధరణ సాధ్యమే
దెబ్బతిన్న మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను పునరుద్ధరించడం సాధ్యమేనని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యారేజీ మొత్తం డాటాను విశ్లేశించడం, లోపాలను కనుగొనడం, వాటిని సరిచేయడం వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్‌డీఎ్‌సఏ దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు. ఇటీవల రెండు దఫాలుగా పర్యటించి వెళ్లిన ఎన్‌డీఎ్‌సఏ నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న పియర్ల వద్ద గ్రౌటింగ్‌ను పకడ్బందీగా చేయడంతోపాటు గోడను నిర్మించి బ్యారేజీని రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అంతర్వాహినులే అగాధానికి కారణం!
మహదేవపూర్ రూరల్: మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో పిల్లర్ల కుంగుబాటుకు అంతర్వాహినులే (సబ్ సర్వేస్ ఫ్లోలు) ప్రధాన కారణమని తెలుస్తోంది. వీటివల్లే బ్యారేజీ కింద భారీ స్థాయిలో ఇసుక జారిపోయి అగాధం ఏర్పడినట్లు భావిస్తున్నారు. బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులోనూ అంతర్వాహినుల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఇంజనీరింగ్ అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ముందే ఆ ప్రాంతంలో సుడిగుండాల ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో గోదావరి నది రెండు పాయలుగా ప్రవహించేదని, అందులో ఒకటి బ్లాక్-7 మీదుగానే ఉండేదని చెబుతున్నారు. నది పాయలుగా ఏర్పడి ప్రవహిస్తున్నప్పుడు దాని కిందే అంతర్వాహినులు ప్రవహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్యారేజీలో డ్యామ్ మాదిరిగా నెలల తరబడి నీటిని నిల్వ చేయడం వల్లే అంతర్వాహినుల ప్రభావానికి ఆజ్యం పోసినట్లయిందని ఓ అధికారి చెప్పారు. అంతేకాకుండా.. గోదావరి నదిలో ఒక్కో చోట ఒక్కో రకం ఇసుక లభిస్తుందని, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూర్తిగా సన్నరకం ఇసుక ఉండటమే కుంగుబాటుకు మరో కారణమని తెలుస్తోంది.
Updated Date - Jun 24 , 2024 | 03:06 AM