Minister Seethakka: కోట్ల రూపాయల ఆశ చూపినా పార్టీ మారలేదు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Jul 07 , 2024 | 09:47 PM
నగరంలో ఏర్పాటు చేసిన "రణధీర సీతక్క"(Randheera Seethakka) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సీతక్క జీవిత నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన జీవిత విశేషాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
హనుమకొండ: నగరంలో ఏర్పాటు చేసిన "రణధీర సీతక్క"(Randheera Seethakka) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పాల్గొన్నారు. సీతక్క జీవిత నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన జీవిత విశేషాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.." నేను చదువుకుంటున్న రోజుల్లో నక్సలైట్ అవుతానని అనుకోలేదు. విప్లవ ఉద్యమం నుంచి ఇవాళ ప్రజాసేవలో ఉన్నాను. పేదలను అసహ్యించుకునే వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. పేదరిక నిర్మూలన జరిగితేనే నా లక్ష్యం నెరవేరినట్టు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడింది. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావివర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలి. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తాలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నన్ను దెబ్బకొట్టాలని పదేపదే దుష్ప్రచారాలు చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించా. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి గోండులకు అవకాశం రాలేదు, ఎవ్వరూ మంత్రి కాలేదు. నాకు ఆ పదవి వస్తే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వటం లేదు. నా ఉద్యమ జీవితాన్ని కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినా నేను కాంగ్రెస్‌ను వీడలేదు" అని చెప్పారు.