TS News: కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి?
ABN, Publish Date - Jun 06 , 2024 | 03:32 AM
రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది? మోదీ తన క్యాబినెట్‌లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీలో జోరుగా సాగుతున్న చర్చ
2-3 పదవులు దక్కే అవకాశం
కిషన్‌రెడ్డికి ఈసారి కీలకశాఖ!
ఇతరుల్లో బండి, డీకే అరుణ, ఈటల
త్వరలోనే పార్టీకి రాష్ట్ర నూతన సారథి
మంత్రి పదవి రాకుంటే ఈటలకు చాన్స్
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది? మోదీ తన క్యాబినెట్‌లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, దీనిపై రాష్ట్ర బీజేపీ వర్గాలు స్పందిస్తూ.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర క్యాబినెట్ పదవుల కేటాయింపు, రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రివర్గంలో ఒక పదవి (కిషన్‌రెడ్డికి) లభించింది. ఈసారి 8 సీట్లు గెలుచుకున్నందున మంత్రి పదవులు కూడా రెట్టింపు అవుతాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఒక క్యాబినెట్ మంత్రి పదవితో పాటు ఒకటి లేదా రెండు సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవులకు సంబంధించి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు పరిశీలించవచ్చన్న అభిప్రాయాలున్నాయి. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి ఈసారి కేంద్ర క్యాబినెట్‌లో కీలకశాఖ లభించవచ్చని తెలుస్తోంది. బండి సంజయ్, డీకే అరుణ, ఈటలల్లో ఒకరికి లేదా ఇద్దరికి పదవులు లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ మెజారిటీని అధిగమించిన బండి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలవడంతో పాటు క్రితంసారి కంటే ఈసారి మూడింతలు ఎక్కువ మెజారిటీ సాధించారు. అంతేగాక, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ నుంచి పోటీ చేసి సాధించిన మెజారిటీని కూడా సంజయ్ అధిగమించారు. నాడు కేసీఆర్ 2 లక్షల మెజారిటీ సాధించగా బండి సంజయ్ 2,25,509తో గెలిచారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ, అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థంగా ఢీకొని ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా, పలు మండలాల్లో బీజేపీ క్యాడర్ బలహీనంగా ఉన్నా.. వాటన్నింటినీ అధిగమించి డీకే అరుణ విజయ కేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు సాధించగా, తాజా ఎన్నికల్లో పోటాపోటీగా తలపడి 5 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. మరోవైపు, దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ 3 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగిన అనుభవం ఆయనకు ఉంది. పార్టీ అగ్రనేతలు మోదీ, అమిత్‌షాలతో సాన్నిహిత్యం ఉంది.
కొత్త సారథి నియామకం త్వరలో..
రాష్ట్ర బీజేపీ నూతన సారథి నియామకం త్వరలో ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి గత జూలైలో నియమితులయ్యారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో, మరో సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఈటల రాజేందర్‌కు కేంద్ర క్యాబినెట్‌లో బెర్త్ దక్కకపోతే రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Updated Date - Jun 06 , 2024 | 12:05 PM