Yearender 2024: జనాన్ని కదిలించిన నినాదాలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 09:33 PM
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
న్యూఢిల్లీ: 2024లో జరిగిన లోక్ సభ, శాసన సభల ఎన్నికల్లో రాజకీయ పార్టీల నినాదాలు జనాలను కదిలించాయి, ఓటర్లను ఓ ఊపు ఊపాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి. అలాంటి కొన్ని నినాదాలను చూద్దాం.
Yearender 2024: మోదీ కాస్త వెనుకంజ.. రాహుల్ కాస్త ముందంజ
అబ్ కీ బార్ 400 పార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అబ్ కీ బార్ 400 పార్ (ఈసారి 400 స్థానాలకు పైగా) అని నినదించారు. బీజేపీకి 370 లోక్ సభ స్థానాలు, ఎన్డీయేలోని మిగిలిన పక్షాల ఎంపీలతో కలిపి 400కు పైగా స్థానాల్లో గెలవాలనేది ఆయన లక్ష్యం. కానీ ఈ నినాదాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దీటుగా తిప్పికొట్టింది. ఎన్డీయేకి 400కు పైగా స్థానాలు వస్తే, రాజ్యాంగాన్ని మార్చేస్తారని జనాన్ని నమ్మించగలిగింది. దీంతో మోదీ లక్ష్యం నెరవేరలేదు. బీజేపీ కేవలం 240 దగ్గర ఆగిపోగా, ఎన్డీయేకి 293 స్థానాలు మాత్రమే లభించాయి.
ఖటాఖట్ ఖటాఖట్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదం ... ఖటాఖట్ ఖటాఖట్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. తమకు అధికారం ఇస్తే మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఖటాఖట్ ఖటాఖట్ డబ్బులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేటపుడు వచ్చే శబ్దాన్ని ఆయన ఈ విధంగా ప్రచారం చేశారు. ఈ నినాదాన్ని ఇతర రాజకీయ పార్టీలతో పాటు మోదీ కూడా అందుకున్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా దీనిని పలుకుతూ జనాన్ని ఆకర్షించారు. ఏదైనా పని వేగంగా, పదే పదే జరుగుతుందని చెప్పడానికి ఈ శబ్దాన్ని వీరంతా వాడుకున్నారు.
మోదీ స్పందన
ఖటాఖట్ ఖటాఖట్ నినాదంపై మోదీ తనదైన శైలిలో స్పందించారు. గాంధీ కుటుంబీకులు రాజప్రాసాదాల్లో జన్మించారని, వారికి కష్టపడి పని చేయడం ఫలితాలు పొందడం తెలియదని, దేశం తనంతట తానే అభివృద్ధి చెందుతుందని అంటున్నారని, అందుకే వారు ఖటాఖట్ ఖటాఖట్ అంటున్నారని అన్నారు. రాయ్‌బరేలీ ప్రజలు కూడా వారిని ఖటాఖట్ ఖటాఖట్ ఇంటికి పంపించేస్తారని చెప్పారు.
ఫటాఫట్ ఫటాఫట్
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. తేజస్వి మాట్లాడుతూ, మీకు ఉద్యోగాలు ఫటాఫట్ ఫటాఫట్ (త్వరగా) వస్తాయి, బీజేపీ సఫాచాట్ సఫాచాట్ (తుడిచిపెట్టుకుపోతుంది) అవుతుంది అన్నారు. మహిళలకు రూ.1 లక్ష ఖటాఖట్ ఖటాఖట్ వస్తాయన్నారు. ఇండియా కూటమికి ఓట్లు ఠకాఠక్ ఠకాఠక్ ఠకాఠక్ వస్తున్నాయన్నారు.
గటాగట్ గటాగట్
అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన నినాదం గటాగట్ గటాగట్. మేము అవినీతికి పాల్పడబోము, ఇతరులను అవినీతి చేయనివ్వం అని చెప్పినవారు ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా సొమ్ము దండుకున్నారని చెప్పారు. టీకాల కోసం విరాళాలు తీసుకున్నారన్నారు. వాళ్లే ఇప్పుడు గటాగట్ గటాగట్ (మింగడం) అంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రజలు వారిని ఫటాఫట్ ఫటాఫట్ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
బటేంగే తో కటేంగే
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రవీర్ దుర్గాదాస్ విగ్రహాన్ని ఆగ్రాలో ఆవిష్కరించిన సందర్భంగా ఇచ్చిన బటేంగే తో కటేంగే నినాదం 2024లో జరిగిన శాసన సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి లాభం చేకూర్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసాత్మక దాడుల ప్రభావం వల్ల ఈ నినాదం బలం పుంజుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం అనే అర్థంలో ఈ నినాదాన్ని ఆయన ఇచ్చారు. ఓబీసీలు ఐక్యంగా ఉండాలని చెప్తూ, ఓబీసీ సమాజంలోని బజరంగబలి శక్తి రావణాసురుడి లంకను తగులబెడుతుందని మరో నినాదం ఇచ్చారు. లౌకికవాదం ముసుగులో ప్రతిపక్షాలు హిందువులను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓబీసీల బలాన్ని హనుమంతుడి శక్తితో పోల్చారు.
ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల ప్రచారంలో ఏక్ రహేంగేతో సేఫ్ రహేంగే అని నినదించారు. కాంగ్రెస్ తదితర పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విభజించి, వారి రిజర్వేషన్లను దుర్బుద్ధితో లాక్కోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. అందుకే అందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News
Updated Date - Dec 31 , 2024 | 09:35 PM