Yearender 2024: మోదీ దూకుడుకు కళ్లెం
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:47 PM
ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడంతో మోదీ మునుపెన్నడూ లేనివిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సహకారంతో అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ: బీజేపీ నేత నరేంద్ర మోదీ 2014లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన ఎదురులేని మహా యోధుడిగా ప్రచారం జరిగింది. 2024 ఆ ప్రచారానికి, ఆయన దూకుడుకు కళ్లెం వేసింది. ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడంతో ఆయన మునుపెన్నడూ లేనివిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సహకారంతో అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. భారత దేశ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలకు ఇది అద్దం పడుతుంది. ప్రాంతీయ నేతలు కేవలం కూటమి భాగస్వాములుగా మిగిలిపోకుండా, కీలక నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి ఎదిగారు.
Yearender 2024: మౌనంగా ఎదిగిన రాహుల్ గాంధీ
మోదీ వచ్చినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలు క్షీణిస్తున్నాయనే వాదనను ప్రజలు తిప్పికొట్టారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ; జార్ఖండ్‌లో జేఎంఎం పార్టీలను ఓటర్లు ఆదరించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేశారు. 99 స్థానాలతో లోక్‌సభలో ప్రతిపక్ష హోదా లభించే స్థాయికి తీసుకెళ్లారు. అదే సమయంలో మోదీ, బీజేపీ దూకుడును 240 స్థానాలతో కట్టడి చేశారు. టీడీపీ, జేడీయూల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమంటే, ప్రాంతీయ పార్టీల ప్రభావం, సత్తా స్పష్టంగా వెల్లడైనట్లే. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు అత్యంత కీలక పాత్ర పోషించగలవని స్పష్టమవుతున్నది.
మరోవైపు ఒడిశాలో బీజేడీ, తెలంగాణలో బీఆర్ఎస్, ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్‌పీ 2024 లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని అయినా గెలుచుకోలేకపోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో వైకాపా గట్టి ఎదురు దెబ్బకు గురైంది.
2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి తిరుగు ఉండదని భావించినవారికి ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇండియా కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు మోదీ కూడా అవాక్కయ్యారు. దాదాపు 500 ఏళ్ల నుంచి రగులుతున్న రామాలయం సమస్యను పరిష్కరించినందుకు ప్రజలు తమకే పట్టం కడతారని యోగి, మోదీ ఆశించారు. కానీ ప్రజలు వారి ఆశలపై నీళ్లు జల్లారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రాంతీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం దక్కించుకుంది.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని ప్రజలు మరోసారి బలపరిచారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీ విసిరిన అనేక సవాళ్లను ధీరోదాత్తంగా తిప్పికొట్టి, తన పార్టీని విజయతీరాలకు చేర్చారు.
ఈ ధోరణినిబట్టి స్థానిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రాంతీయ పార్టీలకు చక్కని భవిష్యత్తు ఉంటుందని వెల్లడవుతోంది. ఏ ప్రభుత్వమైనా ప్రాంతీయ ఆకాంక్షలను తన జాతీయ ఎజెండాలో పెట్టక తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అది జరిగినపుడు ప్రజల మద్దతు సుస్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News