RATHOTSAWAM: వైభవం.. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:00 AM
కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిలమత్తూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూలవిరాట్టును రథంపై ఆశీనులను చేసేందుకు సిద్ధం చేశారు. సంప్రదాయ ప్రకారం స్వామివారిని రథం వద్దకు తీసుకెళ్లేందుకు మండల అధికార, ప్రజాప్రతినిధులను స్వాగతంతో ఆలయానికి తీసుకురావడం ఆనవాయితీ. వారిని మంగళవాయిద్యాలతో వెళ్లి ఆలయానికి తీసుకువచ్చారు. స్వామి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో స్వామివారిని పూలపల్లకిలో అర్చకులు తమ భుజాలపై రథం వద్దకు తీసుకువచ్చారు. రథం ముందు హోమాల అనంతరం పూల పల్లకిలో వచ్చిన స్వామివారిని రథం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అక్కడ నుంచి స్వామిని రథంపై ఆశీనులను చేశారు. వేలాది భక్తుల గోవింద నామ స్మరణల మధ్య రథాన్ని లాగారు. స్వామిని భక్తులు దర్శించుకొని దవనం, అరటిపండును స్వామివారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ఎస్.ఐ మునీర్ అహమ్మద్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణ యాదవ్ బృందం బలిజ సంఘం తదితర కులసంఘాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రథోత్సవానికి టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూపురం మున్సిపల్ చైర్మన డీఈ రమేష్, నాగరాజు, స్థానిక నాయకులు రంగారెడ్డి, నాగరాజుయాదవ్, బేకరీ గంగాధర్, సోమశేఖర్, గౌరీశంకర్, బాలాజీ, అశ్వత్థప్ప, నందీషప్ప రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.