Share News

Pensions : రీ వెరిఫికేషనలో కాసుల వర్షం..!

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:29 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొందరు దివ్యాంగుల పేరుతో ధ్రువపత్రాలు సంపాదించి.. ఆ మేరకు పింఛన్లు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ పింఛన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొందరు డీఆర్‌డీఏ, వైద్య సిబ్బంది వసూళ్లకు తెరలేపారు. వైద్యులతో మాట్లాడి మీ ధ్రువపత్రాలకు ఆమోదం వేయిస్తామని భారీగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది....

 Pensions : రీ వెరిఫికేషనలో కాసుల వర్షం..!
Disabled people attending pension verification at Anantapur Government Hospital

ఆసుపత్రి, డీఆర్‌డీఏ సిబ్బంది కుమ్మక్కు

పరస్పర ఆరోపణలతో వెలుగులోకి..

తాత్కాలికంగా బ్రేక్‌..

11 నుంచి పునఃప్రారంభం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొందరు దివ్యాంగుల పేరుతో ధ్రువపత్రాలు సంపాదించి.. ఆ మేరకు పింఛన్లు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ పింఛన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొందరు డీఆర్‌డీఏ, వైద్య సిబ్బంది వసూళ్లకు తెరలేపారు. వైద్యులతో మాట్లాడి మీ ధ్రువపత్రాలకు ఆమోదం వేయిస్తామని భారీగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది.

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): పింఛన రీ వెరిఫికేషనతో కొందరు జేబులు నింపుకుంటున్నారు. పింఛనదారులకు గాలం వేసి తాము రీ వెరిఫికేషనలో ఇబ్బంది లేకుండా చేయిస్తామంటూ...ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ల పేరుతో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన పింఛనదారులు రీ వెరిఫికేషన కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తున్నారు. సత్యసాయి జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగులకు విఽధులు కేటాయించారు. ఆ జిల్లాకు చెందిన పింఛనదారులతో రీ వెరిఫికేషన సక్సె్‌సకు రూ.30వేల వరకు ఇస్తే పని జరుగుతుందని వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి


తీసుకెళ్లినట్లు సమాచారం. సత్యసాయి జిల్లా డీఆర్‌డీఏ-వెలుగులో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఈఎనటీ విభాగంలో పనిచేసే సిబ్బంది ముగ్గురుతో పాటు సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఇందులో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాత్కాలికంగా పింఛన రీ వెరిఫికేషనకు బ్రేక్‌ పడింది. ఈనెల 11 నుంచి పింఛన రీ వెరిఫికేషన తిరిగి ప్రారంభించనున్నారు.

పరస్పర ఆరోపణలతో రచ్చ

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఉమ్మడి జిల్లాకు చెందిన మానసిక, ఈఎనటీ కేటగిరి పింఛనదారులు వస్తున్నారు. ఈఎనటీ, ఎంఆర్‌ విభాగాల్లో పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బంది పింఛనదారులకు రీ వెరిఫికేషనలో సక్సెస్‌ చేయిస్తా మంటూ...ఒక్కొక్కరి నుంచి రూ.20వేల నుంచి రూ.40వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సత్యసాయి జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి ప్రభుత్వ ఆసుపత్రి ఈఎనటీ విభాగంలో పనిచేస్తున్న మరో ఉద్యోగి పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో రచ్చకెక్కింది. ఈ విషయం డీఆర్‌డీఏ-వెలుగు ఉన్నతాధికారుల వద్దకు చేరినట్లు సమాచారం. సత్యసాయి జిల్లా డీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఓ మండల స్థాయి అధికారితో ఈఎనటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి బేరం కుదిర్చుకున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది.

45,820 మందికి వైద్యపరీక్షలు

అనంతపురం జిల్లాలో దివ్యాంగుల కేటగిరిలో రూ.6వేలు పింఛన తీసుకుంటున్న లబ్ధిదారుల రీ వెరిఫికేషన ప్రారంభించారు. వీరిలో 45,820 మంది ఉన్నారు. మొదటి విడతలో 7,953 మందికి నోటీసులు పంపగా...7,354 మంది రీ వెరిఫికేషనకు హాజరయ్యారు. 599 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన 37,867 మందికి రీ వెరిఫికేషన చేయాల్సి ఉంది.

18 మంది వైద్యులతో రీ వెరిఫికేషన

పింఛన రీ వెరిఫికేషనకు కర్నూలు జిల్లా నుంచి 18 మంది వైద్యులను కేటాయించారు. ఇందులో ఏడుగురు ఆర్థో స్పెషలి్‌స్టలు, ఏడుగురు కంటివైద్య నిపుణులు, ఇద్దరు ఈఎనటీ, ఇద్దరు సైక్రియాటిక్‌ డాక్టర్లు ఉన్నారు. మంగళ, బుధ, గురువారాల్లో గుర్తించిన ప్రభుత్వాసుపత్రులలో రీ వెరిఫికేషన చేయనున్నారు. ఇందుకు డీఆర్‌డీఏ-వెలుగు నుంచి 10 మంది ఏపీఎంలతో పాటు సిబ్బందిని కేటాయించారు.

జిల్లాలో 7 ఆసుపత్రుల ఎంపిక

పింఛనదారుల రీ వెరిఫికేషన కోసం జిల్లాలో 11 ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఇందులో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం ఏరియా ఆసుపత్రలు, కళ్యాణదుర్గం, శింగనమల, ఉరవకొండ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను ఎంపిక చేశారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఉమ్మడి జిల్లాకు చెందిన మానసిక వికలాంగులు, ఈఎనటీ కేటగిరితో పాటు ఆర్థో కేటగిరి పింఛనదారుల రీ వెరిఫికేషన జరుగుతోంది. గుంతకల్లులో అంధులు, ఆర్థో కేటగిరి పింఛనదారుల వెరిఫికేషన చేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రుల్లో ఆర్థో కేటగిరి దివ్యాంగులకు మాత్రమే వెరిఫికేషన చేస్తున్నారు.

మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం

పింఛన రీ వెరిఫికేషనలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినా, మభ్య పెట్టినట్లు మా దృష్టికి వచ్చినా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. పింఛనదారులు ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే మా దృష్టికి తీసుకురండి. కచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. రీ వెరిఫికేషన ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతోంది. ఈనెల 11 నుంచి రీ వెరిఫికేషన పునఃప్రారంభిస్తాం. అర్హత ఉన్న పింఛనదారులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. - ఈశ్వరయ్య, పీడీ, డీఆర్‌డీఏ-వెలుగు


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...

Updated Date - Mar 09 , 2025 | 12:29 AM