SCHOOL: బడిలో భోజనం ఆలస్యం
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:23 AM
పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఆలస్యమౌతోంది. ఒంటిపూట బడి నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలో ఉంటున్నారు.

హిందూపురం అర్బన, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఆలస్యమౌతోంది. ఒంటిపూట బడి నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలో ఉంటున్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఉదయం 10.30కే వడ్డించాలి. కానీ శుక్రవారం ఉదయం 11.40 గంటలకు వడ్డించారు. దీంతో ఉదయం ఏమీ తినకుండా వచ్చిన విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడ్డారు. హెచఎం బియ్యం ఆలస్యంగా ఇవ్వడంతో వంట తయారీ ఆలస్యమైందని వంట మనిషి అన్నారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు పోనూ 480 మంది ఉన్నారని, ఒక ప్యాకెట్ బియ్యాన్ని మూడు రోజులకు సర్దుకోమంటున్నారని అన్నారు. రోజుకు ఒక పాకెట్ బియ్యం ఖర్చు అవుతుందని, హెచం మాత్రం 3 రోజులకు ఒక పాకెట్ ఇస్తున్నారని తెలిపారు. రోజుకు 13 క్రేట్‌ల కోడి గుడ్లు ఇవ్వాల్సి ఉండగా 5 క్రేట్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి ఇండెంట్ ప్రకారం బియ్యం, గుడ్లు అందుతున్నా విద్యార్థులకు సరిగా అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, డిప్యూటీ డీఈఓ సూచన మేరకే భోజనం ఆలస్యంగా పెడుతున్నామని హెచఎం సామ్రాజ్యం అన్నారు. రాగి జావ ఇచ్చిన సమయంలో మాత్రమే మధ్యాహ్నం 12.30 భోజనం పెట్టమని సూచించామని, మిగిలిన రోజుల్లో ముందుగానే పెట్టమన్నామని డిప్యూటీ డీఈఓ పద్మప్రియ అన్నారు. ఒంటి పూట బడి నేపథ్యంలో పిల్లలకు ఇబ్బంది లేకుండా సరైన సమయానికి భోజనం పెట్టేలా హెచఎంలు చూసుకోవాలని అన్నారు.