Share News

AP Cabinet Approves Key Development Projects: 4.23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:05 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.4.62 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 4.23 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ముమ్మరంగా అమలు చేయాలని నిర్ణయించింది

AP Cabinet Approves Key Development Projects: 4.23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

  • 4.62 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్‌ ఓకే

  • 26న జాలర్లకు 20 వేల సాయం

  • అమరావతి నిర్మాణాలు ఇక వేగవంతం

  • వెలిగొండలో రూ.106.39 కోట్లతో పనులకు అనుమతి

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 4.23 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.4.62 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్ఐపీబీ) నిర్ణయాలను ఈ మేరకు ఆమోదించింది. రాజధాని నిర్మాణంలో దూకుడు పెంచుతూ రూ.617.33 కోట్లతో శాసనసభ భవనం, 786.05 కోట్లతో హైకోర్టు భవనం నిర్మించాలని నిర్ణయించింది. మంగళవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వేట లేని కాలంలో వెసులుబాటుగా ఉండాలని మత్స్యకారులకు రూ.20 వేలు సాయం అందించే కార్యక్రమాన్ని ఈ నెల 26న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ వివరాలను మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, కందుల దుర్గేశ్‌ సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.


కేబినెట్‌ ఆమోదించిన ముఖ్యమైన తీర్మానాలు

  • పరిశ్రమలు, వాణిజ్యం, ఏపీఎండీసీ ఆర్థిక బలం, పరపతిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవోలకు ఆమోదం. రూ. 9000 వేల కోట్ల బాండ్లు జారీచేయాలని నిర్ణయం.

  • విశాఖపట్నం హిల్‌నంబరు 3 (సెజ్‌)లోని ఐటీ పార్క్‌లో 3.5ఎకరాలు,ఐపీ కాపులుప్పాడలో 56.36 ఎకరాలు యూఆర్‌సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి కేటాయింపు.

  • సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్‌, ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టయిన్‌ 2.0 కార్యక్రమం కింద నగరాల కోసం వాతావరణ కేంద్రం(ఎస్-సీ-3) ఏర్పాటు.

  • ఏపీ ఏకీకృత స్వచ్ఛ ఇంధనవిధానం-2024 కింద కర్నూలు జిల్లా ఆస్పరిలో 88 ఎండబ్ల్యూ పవన విద్యుత్‌ ప్రాజెక్టును స్థాపించడానికి జేఎ్‌సడబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ చేసిన అభ్యర్థనకు సమ్మతి. ఈ విధానం కింద తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం, తూర్పు కనుపూరు, వెల్లపాలెం గ్రామాల్లోను, కోట మండలంలోని కర్లపూడి, సిద్ధవరం గ్రామాల్లోను సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులను బీఈఎస్ఎస్‌ తోపాటు స్థాపించడానికి చింత గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన అభ్యర్థనకు ఆమోదముద్ర.

  • అనంతపురం జిల్లా గుత్తి, పామిడి మండలాల్లో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకు రిన్యూ విక్రమ్‌ శక్తి లిమిటె డ్‌ చేసిన అభ్యర్థనకు సుముఖత.

  • సత్యసాయి జిల్లా హరేసముద్రం, బుల్లసముద్రం, ఉప్పర్లపల్లి, ఎర్ర బొమ్మనహల్లి, కల్లుమర్రి, మనూరు, సమీప గ్రామాల్లో సౌర ప్రాజెక్టులను బీఈఎ్‌సఎ్‌సతోపాటు స్థాపించడానికి చింత గ్రీన్‌ ఎనర్టీకి అనుమతి.

  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో వంద పడకల ఆస్పత్రి కోసం 6.35 ఎకరాల భూమిని ఉచితంగా(లేదా) నామమాత్రపు లీజు ప్రతిపాదికన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు(ఈఎస్ఐసీ) కేటాయింపు.


  • ఏలూరు జిల్లా ఐఎస్‌ జగన్నాథపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి ఉచితంగా కేటాయింపు.

  • చిత్తూరుజిల్లా కుప్పం మండలం బైరుగని పల్లె గ్రామంలో 1.99 ఎకరాల ప్రభుత్వభూమిని 1.31 ఎకరాల పట్టాభూమితో మార్పిడికి నిర్ణయం.

  • ఇండస్ట్రియల్‌ పార్క్‌ల ఏర్పాటుకు నెల్లూరుజిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో 87.56 ఎకరాలు, అదే జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో 220.81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా ఏపీఐఐసీకి కేటాయింపు.

  • విజయనగరం జిల్లా కొత్త వలస మండలం రెల్లి గ్రామంలో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి 516.58 ఎకరాల కేటాయింపు జీవో రద్దు.

  • 2018 ఆగస్టు తుఫాన్‌కు ఎర్ర కాల్వ పరివాహక ప్రాంతంలో పడిన గండ్లు, ఇతర చోట్ల చేపట్టిన 48 పునరుద్ధరణ పనులకు ఆమోదం.

  • వెలిగొండ ప్రాజెక్ట్‌లో 2, 4 ప్యాకేజీలకు రూ.106.39 కోట్లతో నల్లమల జలాశయాన్ని నింపే పనులకు అనుమతి.

  • పోలవరం ప్రాజెక్టులో నవయుగకు ఒప్పంద షరతుల ప్రకారం చెల్లించవలసిన రూ. 57.56 కోట్లను, తుది బిల్లుతోపాటు చెల్లించవలసిన రూ. 36.37 కోట్లను చెల్లించేందుకు ఆమోదం.

  • ఉపముఖ్యమంత్రి పేషీలో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నెలకు రూ.60 వేల పారితోషికంతో వీడియోగ్రాఫర్‌ నియామకానికి అనుమతి.


మెగా డీఎస్సీకి వర్గీకరణే ప్రాతిపదిక

ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదముద్ర వేయగానే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుందని మంత్రులు తెలిపారు. ఈ వర్గీకరణ కోసం 200 రోస్టర్‌ వ్యవస్థను అనుసరిస్తామని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల తెలిపారు. ‘2-3 రోజుల్లో ఆర్డినెన్స్‌, తర్వాత గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వర్గీకరణ ప్రాతిపాదికనే జారీచేస్తాం’’ అని తెలిపారు. సామాజిక న్యాయం పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధికి ఆర్డినెన్సే నిదర్శనమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అన్ని వర్గాలకూ న్యాయం చేయాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. మత కలహాలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని హోం మంత్రి అనిత విమర్శించారు. ఇటీవల నరసన్న పేటలోని ఆలయ సమీపంలో జీసస్‌ సూక్తులు రాయించడం, చర్చి దగ్గర జై శ్రీరామ్‌ అని రాయించడం కుట్రలో భాగమన్నారు. తిరుపతి లడ్డూ విషయంలో సిట్‌ విచారణ పూర్తి చేయగానే బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 05:05 AM