Amaravati : రైతులకు.. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక..
ABN, Publish Date - Jan 14 , 2025 | 01:26 PM
రాజధాని కోసం పచ్చటి పంట పొలాలు త్యాగం చేసిన రైతుల కళ్లల్లో సంక్రాంతి కానుక వెలుగులు నింపుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో కౌలు నిధులు జమ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
సంక్రాంతి పర్వదినం సందర్భంగా కౌలు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు. ఈ డబ్బుతో పండగవేళ కొత్తబట్టలు కొనుక్కుని బంధువులతో సంబరంగా సంక్రాంతి జరుపుకుంటామని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులను కావాలనే విస్మరించి ఐదేళ్లపాటు సక్రమంగా కౌలు చెల్లింపులు చేయకుండా జాప్యం చేసింది. అమరావతి నిర్మాణం ఆగిపోయి, భూములు వదులుకుని వేరే పనులు దొరక్క, ప్రభుత్వం నుంచి రావాల్సిన కౌలు డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు అమరావతి రైతులు. ప్రతి సంవత్సరం కౌలు నిధుల కోసం కోర్టుల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడ్డారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉండటంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. చెప్పినట్లే మరో ఐదేళ్ల పాటు అమరావతి రైతులకు కౌలు చెల్లింపుల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నవ్యాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా రాజధాని కోసం భూములు త్యాగం చేశారు అమరావతి ప్రాంత రైతులు. జగన్ పాలనలో నానా ఇబ్బందులు పడిన అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం ఊరటనిస్తోంది. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కౌలు నిధులను సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కొందరికి సోమవారం నుంచే డబ్బు ఖాతాలో జమకావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. ఏడాదిలో అతి పెద్ద పండగ అయిన సంక్రాంతికి ఒక రోజే ముందే డబ్బులు చేతికి రావడంతో రాజధాని ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులకు సంక్రాంతి కానుక అందించింది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రెండు సంవత్సరాల కౌలు మొత్తాన్ని సోమవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కొంతమంది రైతులకు 9 వ సంవత్సరం కౌలుతో కలిపి మంగళవారం ఉదయానికే జమ అయినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే పెన్షన్లు కూడా జమ చేసింది ప్రభుత్వం. కాగా, రాజధాని గ్రామాల్లో పింఛన్లు, కౌలు మొత్తాలు చెల్లించేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.255 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం నిధులను పూర్తిస్థాయిలో జమ చేసినట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) అధికారులు పేర్కొన్నారు.
Updated Date - Jan 14 , 2025 | 01:26 PM