Nara Lokesh: నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషపై శిక్షణ
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:15 AM
బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం విద్యనభ్యసిస్తున్న వారికి ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

స్కిల్ బీతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం విద్యనభ్యసిస్తున్న వారికి ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. స్కిల్ బీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గురువారం ఈమేరకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జర్మనీలోని ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణకు మూడు లక్షల మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉందని, ఈ అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులు అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. స్కిల్ బీ ఇండియా వ్యవస్థాపకుడు వింజమూరి రవిచంద్ర గౌతమ్, సీఈవో ఉజ్వల్ చౌహాన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా 10వేల మందికిపైగా విదేశాల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు, గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాలుగు వేల మందికి జర్మన్ భాషపై శిక్షణ ఇస్తామన్నారు.