Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:37 PM
Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్‌లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..

చెన్నై/పార్వతీపురం: సొంతూళ్లో కడుపు నింపుకునే దారి దొరక్క ఉపాధి కోసం తెలిసిన వారితో కలిసి తమిళనాడు పయనమయ్యాడు ఆ వ్యక్తి. దారి మధ్యలో టీ తాగుదామని ఒక స్టేషన్‌లో దిగడమే అతడి జీవితానికి శాపమైంది. రైలు వెళ్లిపోవడంతో తెలియని ప్రాంతంలో దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, చేతిలో డబ్బు లేక ఆవేదనతో తిరుగుతున్న ఆ అమాయకుడిని ఒకతను పని ఇస్తా రమ్మంటూ నమ్మించి వెంటబెట్టుకెళ్లాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు కుటుంబానికి దూరం చేసి నరకం చూపించాడు.
పని ఇప్పిస్తానని చెప్పి..
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొండగొర్రి చుక్క(60) 2003లో ఉపాధి కోసం చెన్నై వెళ్లాడు. అక్కడ నుంచి రామనాథపురం రైలెక్కి తిరిగొస్తూ టీ తాగాలని అనిపించడంతో శివగంగ రైల్వేస్టేషన్‌లో దిగాడు. కానీ, టీ తాగడం పూర్తయ్యేలోపే కళ్లెదుట నుంచే ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయింది. చుట్టూ ఉన్నవారంతా మాట్లాడేది తమిళం కావడంతో ఒక్క ముక్కా అర్థం కాలేదు. పైగా చదువు రాదు. చేతిలో డబ్బు లేదు. తన సమస్య చెప్పుకునేందుకు ఒక్కరైనా కనిపించకపోతారా స్టేషన్ ఆవరణలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే అన్నాదురై అనే వ్యక్తి చుక్క దగ్గరికి వచ్చి ప్రేమగా పలకరించాడు. పని ఇప్పిస్తా అని చెప్పి తనతో పాటు రమ్మన్నాడు. శివగంగై జిల్లా కడంబన్‌కుళంలోని ఉన్న తోటకు తీసుకెళ్లాడు. అప్పారావు అని పేరు మార్చి 20 ఏళ్లపాటు జీతం లేకుండా వెట్టి చాకిరీ చేయించాడు.
వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించిన..
2 దశాబ్దాలుగా గొర్రెల కాపరిగా బానిసగా దీనావస్థలో బతుకీడుస్తున్న చుక్క కన్నీటి వ్యథ ఈ ఏడాది బయటపడింది. శివగంగై జిల్లాలో జనవరి 31న కార్మిక సంక్షేమశాఖ అధికారులు వెట్టి పనులు చేస్తున్న వారిని గుర్తించేందుకు తనిఖీలు చేపట్టినపుడు.. గొర్రెలు కాస్తున్న చుక్కను వారు గుర్తించారు. అతడి వివరాలు తెలుసుకుని మన్యం కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు విషయం చేరవేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని బాధితుడి కుటుంబం వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించారు. 5 ఏళ్ల కిందటే చుక్క భార్య చనిపోగా, కుమార్తె దొంబుదొర సాయమ్మ కుటుంబంతో కలిసి పార్వతీపురం మండలం ములక్కాయవలసలో నివసిస్తున్నట్లు తెలిసింది.దీంతో వెంటనే అధికారులతో పాటు కుమార్తె సాయమ్మ, అల్లుడిని తమిళనాడుకు పంపాడు.
తమిళనాడు కార్మికశాఖ అధికారులు ఎదుట 20 ఏళ్ల తర్వాత సొంతవారిని కలుసుకున్నాడు 60 ఏళ్ల చుక్క. తండ్రీ కుమార్తెలు ఒకరినొకరు చూసుకున్న వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. తమని కలిపినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లుగా చుక్కతో వెట్టిచాకిరీ చేయించుకున్న అన్నాదురైని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివగంగై కలెక్టర్ ఆశా అజిత్ బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నగదు సాయమందించగా..ఐటీడీఏ సహకారంతో ఇల్లు మంజూరు చేస్తామని మన్యం కలెక్టర్ ప్రకటించారు.
Read Also : CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ను రూపొందించాం
Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను
Breaking News: అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్.. గందరగోళ పరిస్థితులు..