చేపల వేటకు విరామం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:37 AM
ఎగసిపడే అలలను చీల్చుకుంటూ.. పగలు, రాత్రి లేకుండా.. నడిసంద్రంలో జీవన పోరాటం చేసే మత్స్యకారులకు కొంతకాలం విశ్రాంతి లభించనుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం మంగళవారం నుంచి 61 రోజులపాటు చేపల వేటకు విరామం ప్రకటించింది. నిషేధాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

- నేటి నుంచి 61 రోజులపాటు
మత్స్య సంపద వృద్ధికి ఈ రెండు నెలలే కీలకం
పులికాట్‌కూ వర్తింపు
ఎగసిపడే అలలను చీల్చుకుంటూ.. పగలు, రాత్రి లేకుండా.. నడిసంద్రంలో జీవన పోరాటం చేసే మత్స్యకారులకు కొంతకాలం విశ్రాంతి లభించనుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం మంగళవారం నుంచి 61 రోజులపాటు చేపల వేటకు విరామం ప్రకటించింది. నిషేధాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
- తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి
జిల్లాలో చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో 75 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం విస్తరించి ఉంది. తీర గ్రామాల్లోని మత్స్యకారులు చేపల వేటతో జీవనం సాగిస్తున్నారు. వీరు 25 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నుంచి వేటకు వెళుతుంటారు. సముద్ర జలాల్లో మత్స్య సంపద పెంపు, మత్సకారుల జీవనోపాధి మెరుగు పరచడమే ధ్యేయంగా వేట నిషేధాన్ని 61 రోజుల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రొయ్యలు, చేపలు ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్య తమ సంతానోత్పత్తికి గుడ్లు పెట్టే కాలంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ కాలంలో వేటను సాగిస్తే గుడ్లు వలలకు చిక్కుకుని సంపద తగ్గే ప్రమాదం ఉంది. ఈ రెండు నెలల పాటు వేటను నిషేధిస్తే, ఆ తర్వాత ఏడాది పాటు మత్స్యకారులకు సంపద ఎక్కువగా లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. పులికాట్ సరస్సుకు కూడా ఈ నిబంధన వర్తింపు చేసినట్లు వారు తెలిపారు.
నిషేధ కాలంలో భృతి
చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం జీవన భృతి అందజేస్తోంది. ఈ భృతి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం గతేడాది రూ.10వేలు ఇస్తామని ప్రకటించింది. అప్పటి జగన్ ప్రభుత్వం వడపోత వల్ల చాలా మంది మత్స్యకారులు భృతికి దూరమయ్యారు. ఈ ఏడాది చేపల వేట నిషేధ కాలంలో భృతిని రూ.20వేలకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుకు వారికి అందజేయనుంది.
నిధులు మంజూరైన వెంటనే వారి ఖాతాల్లో జమ
వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం రూ.20 వేల భృతి అందిస్తుంది. ఈ నిధులు మంజూరైన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తాం. మత్స్యకారులను ఈ రెండు నెలల పాటు ఆదుకుంటాం.
- కలెక్టర్ వెంకటేశ్వర్
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఈ 61 రోజుల్లో ఎవరైనా వేట సాగిస్తే జరిమానాతో పాటు బోటు రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తాం. మరబోట్లు ఉన్నవారంతా ఈ నిషేధాన్ని పాటించాల్సిందే.
- రాజేష్, జిల్లా మత్స్యశాఖ అఽధికారి
జిల్లా వివరాలు
సముద్ర తీరం పొడవు : 75 కిలోమీటర్లు
తీర ప్రాంత మండలాలు : ఐదు
మత్స్యకార గ్రామాలు : 42
మత్స్యకారులు : 20వేల మంది
వేట సాగించేవారు : 3,876 మంది
సముద్ర తీరంలో వేట సాగించే బోట్లు : 878
ఇళ్లకు చేరిన మత్స్యకారులు
కోట, ఆంధ్రజ్యోతి: చేపల వేట నిషేధం నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులంతా ఇప్పటికే ఇళ్లకు చేరుకున్నారు. తమ పడవలను సముద్ర తీరంలో భద్రపరుచుకున్నారు. ఈ 61 రోజుల పాటు పడవలన్నీ తీరానికే పరిమితం కానున్నాయి.