తిరుమలలో డ్రైవర్ల మధ్య ఘర్షణ
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:48 AM
తిరుమలలో డ్రైవర్ల దాడిలో గాయపడిన ఓ జీపు డ్రైవర్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోటకు చెందిన వెంకటశివ తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటున్నాడు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి
తిరుమల, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో డ్రైవర్ల దాడిలో గాయపడిన ఓ జీపు డ్రైవర్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోటకు చెందిన వెంకటశివ తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటున్నాడు. ఈనెల 12న పోలీ్‌సకాంప్లెక్స్‌కు సమీపంలోని రాంబగీచా బస్టాండు సమీపాన ఇతడు తన వాహనాన్ని నిలిపాడు. పార్కింగ్ విషయంలో తిరుపతికి చెందిన మరో ముగ్గురు డ్రైవర్లు వెంకటశివతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి వెంకట శివపై రాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటశివను పోలీసులు తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మద్యం మత్తులోనే డ్రైవర్లు దాడి చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. డ్రైవర్ మృతి సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.