Share News

మూగబోయిన బహుజన స్వరం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:52 AM

తెలుగు కథాసాహిత్యంలో బహుజన స్వరాన్ని బలంగా వినిపించిన ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ మృతి, సాహిత్య వర్గాలను దిగ్ర్భాంతికి గురిచేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన ఈయన సోమవారం ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆఖరి శ్వాస విడిచారు.

మూగబోయిన బహుజన స్వరం

ద్రావిడ మాజీ వీసీ, కథారచయిత తుమ్మల రామకృష్ణ మృతి

కుప్పం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):తెలుగు కథాసాహిత్యంలో బహుజన స్వరాన్ని బలంగా వినిపించిన ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ మృతి, సాహిత్య వర్గాలను దిగ్ర్భాంతికి గురిచేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన ఈయన సోమవారం ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆఖరి శ్వాస విడిచారు. కథా రచయితగా ప్రసిద్ధుడైన ఆచార్య తుమ్మల రామకృష్ణ స్వస్థలం చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె గ్రామం. పెద్దఉప్పరపల్లె, నెరబైలు గ్రామాలలో హైస్కూలు దాకా చదువుకున్న ఆయన ఇంటర్మీడియట్‌ తిరుపతిలో చదువుకున్నారు. శ్రీవేంకటేశ్వర విద్యాలయంలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ తీసుకునేదాకా ఉన్నత విద్యాభ్యాసం సాగింది. హైదరాబాదులోని సెంట్రల్‌ యూనివర్సిటీలో తెలుగు ఆచార్యుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా 2020లో నియమితులయ్యారు. 2023, నవంబరు 25న ఇక్కడే పదవీ విరమణ చేశారు. ద్రావిడ యూనివర్సిటీ రాజకీయాల్లో ఆయన నలిగిపోయారు. ఈ సమయంలోనే అనారోగ్యానికి కూడా గురయ్యారు. హైదరాబాదులోని లింగంపల్లిలో ఉంటూ చికిత్స తీసుకునేవారు.

బహుజన కెరటం: తుమ్మల కలం బహుజన ధిక్కార స్వరం. ‘అడపం మేలుకొంది’ అన్న తుమ్మల కథ చిత్తూరు జిల్లా ఊళ్లల్లో నేటికీ మారని బహుజనుల జీవితాల వేదన తెలియజేస్తుంది. తుమ్మల రామకృష్ణ రాసిన ‘మహా విద్వాంసుడు’ కథ - సంగీతంలోని వివక్షను ఎత్తి చూపుతుంది. ఊబి, ఊరిమద్దిస్తం, ఓ సాయంత్రం, డాక్టర్‌ గుర్నాథం, పరాభవం, రాలిన చింత, రేగడిమిట్ట, స్పెషల్‌ స్క్వాడ్‌ వంటి కథలతో ‘ మట్టిపొయ్యి’ సంపుటి ప్రచురించారు. తెల్లకాకులు అనే కథను పుస్తకంగా ప్రచురించారు. ఇది అనేక భాషల్లోకి అనువాదం అయ్యింది. కర్నూలులో కథా సాహిత్య వాతావరణాన్ని పునరుజ్జీవింపజేసిన కథకుడిగా తుమ్మలను గుర్తిస్తారు. ఇక్కడి నుంచి ఆయన చొరవతో వచ్చిన ‘పల్లెమంగలి కథలు’ తెలుగు కథాసాహిత్యంలో బహుశా తొలి వృత్తి కథల సంకలనం. ఆయన సారథ్యంలోనే అడపం పేరుతో వృత్తి కథల సంకలనం వెలువడింది. ‘పరిచయం’, ‘బహుముఖం’, ‘అవగాహన’ వ్యాస సంపుటాలు, ‘అభిచందనం’ పేరుతో సమీక్షలు - ప్రసంగాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. ఆయన రచనలు అనేకం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటూ మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లోకీ అనువాదం అయ్యాయి. ఆయన సాహిత్య కృషిపై పలువురు రాసిన వ్యాసాలతో ‘సీమ సంతకం’ అనే పుస్తకం వెలువడింది. ఎనభైల తర్వాత ఊపందుకున్న అస్తిత్వ ఉద్యమాల జాడలు తుమ్మల రామకృష్ణ రచనల్లో కనిపిస్తాయి. స్వయంగా ఒక బహుజనునిగా పొందిన అనుభవాలు, సంవేదనల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. ఆయన ఎలుగెత్తిన బహుజన ధిక్కార స్వరం ఇంకా గట్టిగా, వేయిగొంతుకుల పెట్టుగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

పెద్ద లోటు

తుమ్మలకు సాహిత్య వర్గాల నివాళి

కుప్పం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ వర్సిటీ మాజీ వీసీ, కథారచయిత తుమ్మల మరణంపై వర్సిటీ వర్గాలు, సాహిత్య వర్గాలు సంతాపం ప్రకటించాయి. ఆయన సాహిత్య కృషినీ, తమ అనుబంధాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

ఆయన రాయాల్సింది ఇంకా చాలానే ఉంది. రాస్తాననీ చెప్పాడు. భోళా మనిషి. వృత్తి కథలకు దారి చూపి వెళ్లిపోయాడు. గొప్ప స్నేహశీలిని కోల్పోయాం.

- మధురాంతకం నరేంద్ర, కథా రచయిత

1980లలో ఎస్వీయూనివర్సిటీ ఎఫ్‌ బ్లాక్‌లో తుమ్మల రామకృష్ణతో మొదలైన పరిచయం నాతో సహా సాహిత్య వర్గాలకు గట్టి స్నేహంగా మారింది. మా అందరిలోకీ చిన్నవాడు. అందరం చినబ్బా అని పిలిచేవాళ్లం. ఆయన లేడంటే నమ్మలేకున్నాం.

-ప్రొఫెసర్‌ డి.కిరణ్‌ క్రాంత్‌ చౌదరి

ఆయన లేని లోటు బహుజన సాహిత్యాన్ని ఎక్కువగా బాధిస్తుంది. ఆయన కథలు ‘అడపం మేలుకొంది’, ‘మహా విద్వాంసుడు’ బహుజన సాహిత్యానికి ప్రతీకలుగా నిలిచాయి.

- శ్రీదేవి, ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు

చదువుకునే రోజుల్లో గాంధీరోడ్డులోని డీలక్స్‌ హోటల్‌ గురువు కేతు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో సాహిత్య చర్చలు జరిగేవి. తుమ్మల క్రియాశీలి. ఒక చిన్న పల్లె నుంచి బీసీ నేపథ్యం నుంచి వచ్చి హైదరాబాదు సెంట్రల్‌ వర్సిటీ ఆచార్యుడుగా చేరి, ఒక వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ అయ్యాడు. గొప్ప మిత్రుడిని కోల్పోయాం.

- డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని, రచయిత

Updated Date - Apr 01 , 2025 | 12:52 AM