Share News

అభివృద్ధే లక్ష్యంగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:29 AM

తిరుపతి జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. అందులో భాగంగా శ్రీసిటీ విస్తరణకు అదనంగా 2500 ఎకరాలను కేటాయించడానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుమల పర్వత పాదాల చెంత నుంచి ఒబెరాయ్‌ తదితర హోటళ్లను దూరంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తున్నామన్నారు. కొత్తగా లులూ, మహీంద్రా, రహేజా, అట్మోస్ఫియర్‌ తదితర సంస్థలు జిల్లాకు వస్తున్నాయని వివరించారు.

అభివృద్ధే లక్ష్యంగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం
ఎమ్మెల్యేలు, అధికారులు, టీడీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి అనగాని సత్యప్రసాద్‌

తిరుపతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. అందులో భాగంగా శ్రీసిటీ విస్తరణకు అదనంగా 2500 ఎకరాలను కేటాయించడానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుమల పర్వత పాదాల చెంత నుంచి ఒబెరాయ్‌ తదితర హోటళ్లను దూరంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తున్నామన్నారు. కొత్తగా లులూ, మహీంద్రా, రహేజా, అట్మోస్ఫియర్‌ తదితర సంస్థలు జిల్లాకు వస్తున్నాయని వివరించారు. నాయుడుపేట వద్ద నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూముల కేటాయింపులో అడ్డంకులను తొలగిస్తున్నామని వివరించారు. క్రిస్‌ సిటీలో రూ.1500 కోట్ల పనులు త్వరగా పూర్తి చేసేలా సమీక్షిస్తున్నామన్నారు. సాగరమాల రోడ్లు, రేణిగుంట-కడప, తిరుపతి-మదనపల్లె రోడ్డు వంటి రూ.6 వేల కోట్ల పనులను ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని, ఇక మిగిలింది రైల్వే పనులేనని స్పష్టం చేశారు.శాప్‌ చైర్మన్‌ రవినాయుడు అభ్యర్థన మేరకు తిరుపతి కలెక్టరేట్‌ సమీపంలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు నిర్మాణానికి 34 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ క్రీడా ప్రాంగణం నిర్మిస్తామన్నారు.

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

వేసవిలో తాగునీటి సమస్య, జిల్లా అభివృద్ధిపైన, పీజీఆర్‌ఎస్‌ అర్జీలపైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించామని మంత్రి వివరించారు. వేసవిలో ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే ప్రతి అర్జీనీ పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో.. రీ సర్వేలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పీ4 సర్వేలో వెల్లడైన 20 శాతం మంది పేదలకు సాయం అందేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, దాతలను ఒప్పించాలని కోరారు.

‘శెట్టిపల్లె’ భూ వివాదానికి శాశ్వత పరిష్కారం

తిరుపతిలోని శెట్టిపల్లె భూముల వివాదానికి త్వరలో శాశ్వత పరిష్కారం చూపినసస్తామని మంత్రి సత్యప్రసాద్‌ ప్రకటించారు. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే దీనిపై దృష్టి పెట్టిందని, జిల్లా అధికారులు నెలల తరబడీ కసరత్తు చేసి తుది పరిష్కారం దిశగా నివేదిక సిద్ధం చేశారన్నారు. కలెక్టర్‌, జేసీ, మున్సిపల్‌ కమిషనర్‌ ఇటీవల అమరావతికి వచ్చి ప్రభుత్వానికి నివేదించారన్నారు. త్వరలో శెట్టిపల్లి వాసులు శుభవార్త వింటారని, అక్కడ భూముల అనుభవదారులకు హక్కులు కల్పించడంతో పాటు మోడల్‌ టౌన్‌షి్‌ప నిర్మిస్తామన్నారు.

ఓటేరు చెరువుపై లోతుగా పరిశీలిస్తున్నాం

తిరుపతి రూరల్‌ మండలంలోని ఓటేరు చెరువు భూముల వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ చెరువు భూములు పట్టా భూములని తొలుత రికార్డుల్లో నమోదైందని, తర్వాత చెరువని నమోదైందని, ఇలా భూముల స్వభావం రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులకు గురైందని వివరించారు. ఈ వివాదం కోర్టులో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేమన్నారు. రెవెన్యూ రికార్డులను కలెక్టర్‌ పరిశీలిస్తున్నారని, దానికనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుపతి డీసీ తీరుపై విచారణ

తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ టీడీఆర్‌ బాండ్ల వ్యవహారంలో విచారణ సవ్యంగా సాగకుండా అడ్డుపడుతున్నారని ఫిర్యాదు వచ్చిందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇదివరకే ప్రభుత్వం బదిలీ చేసినా ఇంకా అక్కడే కొనసాగుతున్నారనీ తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వినాయకసాగర్‌లో నిరసనలపై చట్టపరంగా చర్యలు

ఇటీవల తిరుపతి వినాయకసాగర్‌ పార్కులో వైసీపీ శ్రేణులు అరగంట పాటు నాటకం ప్రదర్శించి సీఎంను, ప్రభుత్వాన్ని కించపరిచిన విషయమై చట్టపరంగా చర్యలుంటాయని మంత్రి సత్యప్రసాద్‌ తెలిపారు. దానిపై ఎస్పీకి కమిషనరు ఫిర్యాదు చేశారన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలిస్తాం!

తిరుపతిలో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు కేటాయిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రకటించారు. ఇదివరకే జర్నలిస్టులు వినతిపత్రం ఇచ్చారన్నారు. 700 మంది దాకా ఉన్నారని, అందులో యూట్యూబ్‌ ఛానెళ్ళ ప్రతినిధులూ చాలా మంది వున్నారన్నారు. వడపోసి అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రితో పాటు సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జేసీ శుభమ్‌ బన్సాల్‌, కమిషనర్‌ మౌర్య, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పులివర్తి నానీ, బొజ్జల సుధీర్‌రెడ్డి, విజయశ్రీ, ఏపీ యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, నేతలు ఊకా విజయ్‌కుమార్‌, కోడూరు బాలసుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణరెడ్డి, పులిగోరు మురళి, ఊట్ల సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

‘టీడీఆర్‌’పై సమగ్ర విచారణ చేపట్టండి

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ‘టీడీఆర్‌’ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, డిప్యూటీ మేయర్‌ ఆర్‌సీ మునికృష్ణ, విజయకుమార్‌, పులుగోరు మురళీకృష్ణారెడ్డి, జేబీ శ్రీనివాస్‌, ఽశ్రీధర్‌వర్మ, హేమంత్‌ రాయల్‌ తదితరులు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఇన్‌ఛార్జి మంత్రి నిర్వహించిన గ్రీవెన్స్‌కు ప్రజలతో పాటు టీడీపీ శ్రేణుల నుంచీ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలో 2019-24 మధ్యలో జరిగిన అవినీతిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినా ఇప్పటికీ స్పందనలేదన్నారు. మున్సిపాలిటీ, తుడాలో పాత అధికారులే కొనసాగుతున్నారని, అక్కడ ప్రక్షాళన చేయాలన్నారు. టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి జాప్యం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల స్థానికుల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మబ్బు దేవనారాయాణరెడ్డి, బుల్లెట్‌ రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి గంగ జాతర నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Apr 09 , 2025 | 12:29 AM