Share News

ఏ మందులైనా ఇచ్చేస్తాం..!

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:51 AM

చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ తిరుపతిలోని న్యూరాలజీ డాక్టరు వద్ద చికిత్స పొందుతున్నాడు. పది రోజులకు మాత్రలు రాసిచ్చారు. మాత్రలు అయిపోయాక మళ్లీ కావాలని సూచించాడు. పది రోజులు వాడాక నొప్పి తగ్గింది.

ఏ మందులైనా ఇచ్చేస్తాం..!
మార్చి 21వ తేదీన ‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగా చిత్తూరులోని ఓ మెడికల్‌ దుకాణంలో తనిఖీలు చేసిన అధికారులు

కొన్నిరకాల మెడిసిన్‌కు వైద్యుల చీటీ తప్పనిసరి

అయినా విక్రయించేస్తున్నారు

జిల్లాలో మెడికల్‌ షాపుల తీరిది

‘ఆపరేషన్‌ గరుడ’లోనూ వెల్లడి

చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ తిరుపతిలోని న్యూరాలజీ డాక్టరు వద్ద చికిత్స పొందుతున్నాడు. పది రోజులకు మాత్రలు రాసిచ్చారు. మాత్రలు అయిపోయాక మళ్లీ కావాలని సూచించాడు. పది రోజులు వాడాక నొప్పి తగ్గింది. మళ్లీ రెండ్రోజుల తర్వాత నొప్పి మొదలవడంతో స్థానిక మెడికల్‌ షాపుకెళ్లాడు. మాత్రల చీటీ చూపి.. మందులు కొని వాడాడు. డోస్‌ ఎక్కువ కావడంతో అతడిపై తీవ్ర దుష్ప్రభావం చూపింది. మళ్లీ వైద్యుడి వద్దకెళ్లడంతో ఆయన మందలించాల్సి వచ్చింది.

ఫ చిత్తూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే వ్యక్తికి భార్య ఫోన్‌ చేసి.. తమ ఐదేళ్ల కుమారుడికి జ్వరం, జలుబు, దగ్గు వచ్చిందని మందులు తేవాలని కోరింది. ఆయన డ్యూటీ అయ్యాక ఇంటికెళ్లేటప్పుడు స్థానిక ఓ మెడికల్‌ షాపులో విషయం చెప్పి.. కొన్నిరకాల మందులు, సిరప్‌ తీసుకెళ్లాడు. వాటిని ఆ చిన్నారికి వాడారు. అవి సరైన మోతాదు కాకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైద్యుడు మందలించాడు. ఇలాంటివి జిల్లావ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.

- చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి

జిల్లాలోని మందుల దుకాణాల్లో మత్తు కలిగించే మందులను సైతం యథేచ్చగా విక్రయిస్తున్నారు. యాంటీ అలర్జీ, అధిక మోతాదు నొప్పి నివారణ మాత్రలు, దగ్గు సిర్‌పలను కచ్చితంగా డాక్టర్ల చీటీ ఉంటేనే విక్రయించాల్సి ఉండగా, దుకాణాల నిర్వాహకులు అవేమీ పట్టించుకోవడం లేదు. చాలా దుకాణాల్లో అర్హులైన ఫార్మసిస్టులే లేరని కొందరు వైదులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ గరుడ’లోనూ ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై కాలపరిమితి ముగిసిన మందులను గ్రామీణులకు అంటగట్టి వారి ప్రాణాలతో చెలగాలమాడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

హెచ్‌-1 రికార్డు తప్పనిసరి

హెచ్‌-1 రికార్డు అంటే విలువైన మందులు, మత్తు, నార్కోటిక్స్‌, యాంటీబయాటిక్స్‌ విక్రయించే సమయంలో దుకాణ యజమాని తప్పనిసరిగా తీసుకునే వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. దీనిద్వారా మందులను సక్రమంగా వినియోగిస్తున్నారా..? లేదా..? అన్నది తెలుసుకోవచ్చు. ప్రతి మెడికల్‌ షాపుల్లోనూ ఈ రికార్డు తప్పనిసరిగా ఉండాలి.

పెరుగుతున్న కిడ్నీ బాధితులు

నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వినియోగించడంతో కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. జిల్లాలో అధికారికంగా 756 మంది ఉండగా అనధికారికంగా మరో 500 మంది వరకు ఉంటారు.

ఎవరో వచ్చి తనిఖీ చేస్తేనే..

రెండు నెలల క్రితం ఉమ్మడి జిల్లాలో హోమియో మందుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ నిర్వహించారు. డూప్లికేట్‌ మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజయవాడ నుంచి అధికారులు జిల్లాకు వచ్చి తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. అలాగే గత మార్చి 21వ తేదీన చిత్తూరు నగరంలో నిషేధిత మందులు విక్రయిస్తున్నారని మెడికల్‌ షాపులపై ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో రీజనల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు దుకాణాల్లో నిషేధిత, డాక్టర్‌ చీటీ లేకుండా మందులు విక్రయిస్తున్నారనే అభియోగంతో ఆయా దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇలా ఎవరో.. ఎక్కడి నుంచో వచ్చి దాడులు నిర్వహిస్తే తప్ప జిల్లాలోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేదు.

ఫార్మసిస్టు లేకుండానే..

జిల్లాలో 1,100 మెడికల్‌ షాపులు అధికారికంగా ఉంటే మరో 200లకుపైగా అనధికారికంగా ఉన్నాయి. అందులో ఆర్‌ఎంపీలు తదితరులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో సగానికంటే ఎక్కువగా దుకాణాల్లో ఫార్మసిస్టులు పనిచేయడం లేదు. ఒకరి పేరుతో ఫార్మసిస్టు సర్టిఫికెట్‌ పొంది మరొకరు దుకాణం నిర్వహిస్తున్నారు. యజమాని లేదంటే తక్కువ జీతానికి వచ్చే వ్యక్తిని దుకాణంలో నియమించుకుంటారు. అందువల్ల అనేకసార్లు ఒక ఔషధం బదులు మరొకటి రోగికి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి.

మామూళ్లు ఇవ్వకుంటేనే..!

మామూళ్లు ఇవ్వని మెడికల్‌ షాపులపైనే డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు కొరడా ఝుళిపిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇకనైనా అన్ని షాపులను తనిఖీ చేయాలని జనం కోరుతున్నారు.

డాక్టర్లు సూచించిన మందులనే వాడండి

డాక్టర్లు సూచించిన మందులనే వాడండి. అలా కాకుండా డాక్టర్‌ చెప్పకుండా ఆయన ఇచ్చిన చీటీని చూపించి మళ్లీ మందులు కొని వాడొద్దు. దీంతోపాటు చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు వస్తే మెడికల్‌ షాపులకు వెళ్లి నేరుగా మందులు కొని వాడుతుంటారు. ఇలా చేయడం ప్రమాదకరం.

- డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Apr 15 , 2025 | 01:51 AM