CM Chandrababu Vision: ప్రపంచానికి మనమే మోడల్!
ABN, Publish Date - Jan 22 , 2025 | 03:59 AM
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మారనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్‌గా ఏపీ
ఈ రంగాల్లోకి లక్ష కోట్ల పెట్టుబడులు
టాటాతో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం
దావోస్ సదస్సులో చంద్రబాబు వెల్లడి
భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు
భారత్‌లో స్థిరంగా మోదీ పరిపాలన: సీఎం
అమరావతి, విజయవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మారనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ విద్యుదుత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, ఈ రంగాల్లోకి 115 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.లక్ష కోట్లు) పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా అమరావతిలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్రాన్ని టాటా సంస్థతో కలిసి ఏర్పాటుచేస్తామని చంద్రబాబు అన్నారు. దావోస్ సదస్సులో మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ‘‘గ్రీన్ ఎనర్జీ-గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రియలైజేషన్’’ సెషన్‌లో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. సోమవారం రాత్రి జ్యూరిక్ నుంచి దావోస్‌కు చంద్రబాబు బృందం చేరుకుంది. మంగళవారం ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీగా గడిపింది. అందులోభాగంగా సీఐఐ నిర్వహించిన సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047, గ్రీన్ ఇండస్ర్టీలో దేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌ను ఆయన ఆవిష్కరించారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు తమదైన శైలిని ప్రదర్శిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
సంపద సృష్టిలో ముందున్నాం..
‘‘2047 నాటికి భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా మొదటి, లేక రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. సంపదను సృష్టించటంలో, ప్రపంచ సమాజ సేవ చేయటంలో భారతీయులు ముందుంటారు. దావోస్ సదస్సుకు హాజరైన తెలుగువారందరినీ చూస్తుంటే భవిష్యత్తులో తన కలలు వాస్తవరూపం దాల్చుతాయన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన నగరంగా మార్చేందుకు కృషి చేశాను.
25ఏళ్ల కిందట బిల్‌గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో భారత్‌లో తొలితరం ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఇంటర్నెట్, ఆర్థిక సంస్కరణల ఆధారంగా, రెండో తరం ఆర్థిక సంస్కరణలను నేను ప్రవేశపెట్టాను. 1999లో తొలిసారిగా విద్యుత్తు సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఈ సంస్కరణలు అమలుచేసినందుకుగాను అప్పటి ఎన్నికల్లో ఓడిపోయాను. ఇప్పుడు ఆ సంస్కరణలే ఏపీకి సానుకూల ఫలితాలను అందిస్తున్నాయి.’’
ఇంటింటా సౌర విద్యుత్తే లక్ష్యం
‘‘ఏపీలో విద్యుత్తు ఉత్పాదనకు మంచి అవకాశాలున్నాయి. విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. దానితోపాటు సౌర విద్యుత్తు వినియోగంపై దృష్టి సారించాం. ఇందులోభాగంగా ‘పీఎం సూర్యఘర్’ కింద ఇంటింటా సౌర ఉత్పత్తిని చేసే వినూత్న విధానం అమలు చేస్తున్నాం. ఈవీల కొనుగోలు, సౌర ఫలకాల ఏర్పాటుకు ముందుకొచ్చినవారికి రాయితీలు ఇస్తున్నాం. ఏపీలో ఐదు ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాం. 21 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎన్టీపీసీ- జెన్కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిచేయబోతున్నాయి. మా రాష్ట్రంలో విస్తారమైన తీరప్రాంతం, రవాణాకు అందుబాటులో పోర్టులు ఉన్నాయి. అత్యంత తక్కువ ఖర్చుతో విద్యుత్తును అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలకు కూడా పెద్దపీట వేస్తున్నాం’’
సిస్కోతో చర్చించా: సీఎం
రాష్ట్రాభివృద్ధిలో ‘సిస్కో’ భాగస్వామ్యంపై ఆ సంస్థ సీఈవో అండ్ చైర్మన్ చుర్‌రాబిన్స్‌తో చర్చించానని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘దావోస్‌లో మంగళవారం ‘గ్లోబల్ లీడర్స్ ఇన్ టెక్నాలజీ ఇన్నోవేషన్’ సెషన్‌లో భాగంగా చుక్‌రాబిన్స్‌తో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సిస్కో భాగస్వామి కావడంపై ఇరువురం చర్చించాం’’ అని తెలిపారు.
బాబు విజన్‌లో ఉపాధికే పెద్దపీట : టాటా చంద్రశేఖరన్
చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన విజన్- 2047లో ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశారని టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం తమకెంతో గర్వకారణమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను స్థాపించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయటం మరిచిపోలేని అనుభవం అన్నారు. కాగా, పోటీ తత్వం విషయంలో సీఐఐ ప్రకటించిన సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ బ్రోచర్‌ను చంద్రబాబు విడుదల చేశారు. అనంతరం సీఐఐ - ఐఎండీ స్విట్జర్లాండ్ బిజినెస్ స్కూల్ మధ్య లెటర్ ఆఫ్ ఇండెంట్ మార్పిడి జరిగింది. పాత్ వేటూ ఇండియాస్ గ్రీన్ ఇండస్ర్టిలైజేషన్ ఫ్రమ్ గ్రీన్ హైడ్రోజన్ టూ గ్రీన్ మ్యాన్యుఫాక్చరింగ్ పై విస్తృత చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఐఐ ఉన్నతాధికారి రాజీవ్ మెమానీ, స్విట్జర్లాండ్ ఐఎండీ బిజినెస్ స్కూల్ ప్రెసిడెంట్ డేవిడ్ బాచ్, జీఎంఆర్ గ్రూప్ ఎయిర్ పోర్టు బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు, గ్రీన్ కో గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ అనిల్ కుమార్ చలమలశెట్టి, జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, యారా క్లీన్ అమ్మోనియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్స్, ఒలావ్ రేన్‌లు ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 03:59 AM