Bio Gas Production: నేడు సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:42 AM
రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనుండగా, తొలి ప్లాంట్ ప్రకాశం జిల్లా దివాకరపల్లిలో నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు నారా లోకేశ్ మరియు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు

మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ హాజరు
ప్రకాశం జిల్లా పీసీపల్లిలో సర్వం సిద్ధం
అమరావతి, ఒంగోలు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంటుకు బుధవారం భూమిపూజ జరగనుంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో నాలుగు ప్లాంట్ల కోసం 4,900 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. తొలి ప్లాంట్‌ను కనిగిరి నియోజకవర్గంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివాకరపల్లి వద్ద 459 ఎకరాల్లో రూ.135 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మంగళవారం ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
సీబీజీ విప్లవాత్మక మైలురాయి: లోకేశ్
భారత్‌లో 2035 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తేవడమే లక్ష్యంగా సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని చేపడతామని ఐటీ, ఎలకా్ట్రనిక్స్. విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇందులో భాగంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ)కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో రూ.65వేల కోట్లతో 500 సీబీజీ ప్లాంట్లను స్థాపిచండం విప్లవాత్మక మైలురాయి అన్నారు. వీటి ద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కర్బన ఉద్ఘారాలను నివారించేందుకు విజనరీ లీడర్ చంద్రబాబు వినూత్న ఆలోచనలకు తెరతీశారని అన్నారు.