Invalid Votes: చెల్లడం లేదబ్బా!
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:09 AM
విద్యావంతులైన పట్టభద్రులు మాత్రమే వేసే ఓట్లలో చాలామటుకు చెల్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

చదువుకున్నవారిలో అవగాహన లోపం!!
పట్టభద్రుల స్థానాల్లో భారీగా చెల్లని ఓట్లు
ఉభయగోదావరిలో 19,789 ఓట్లు
కృష్ణా-గుంటూరులో 26,909
ఏలూరు/గుంటూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): విద్యావంతులైన పట్టభద్రులు మాత్రమే వేసే ఓట్లలో చాలామటుకు చెల్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చదువుకున్నవారు బ్యాలెట్ పేపర్‌పై సరిగా ఓటేయలేకపోవడానికి అవగాహనాలోపమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పోలైన 1,99,208 ఓట్లలో 19,789 చెల్లకుండా పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కృష్ణా-గుంటూరు స్థానంలో కూడా 2,41,774 ఓట్లు పోలవగా.. 26,909 ఓట్లు చెల్లుబాటు కాలేదు. గత నెల 27న పోలింగ్‌కు ముందే.. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్ల ఎదుట ఉన్న బాక్సుల్లో ప్రాధాన్య క్రమంలో అంకెలుగా ఓటు వేయాలని పదేపదే సూచించారు. ప్రాధాన్య క్రమంలో ఒకటి అంకె కలిగిన ఓటు ఫలితాన్ని నిర్దేశిస్తుందని కూడా ఎన్నికల కమిషన్ నుంచి పార్టీల అభ్యర్థులు, నేతల వరకు విడమరచి చెప్పారు. ఒకటి గానీ, మరే ప్రాధాన్య కలిగిన అంకెను గానీ ఒకరికి మించి వేయరాదని, అలా వేస్తే ఆ ఓటు మురిగిపోతుందని ప్రచారం చేశారు. కానీ ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ చెల్లని ఓట్లు భారీగా దర్శనమిచ్చాయి. ఈసారి పట్టభద్రులు పెద్దసంఖ్యలో ఓటు హక్కు న మోదు చేసుకున్నారు. తీరా ఓటుకి వచ్చేసరికి గత ఎన్నికల కంటే ఈసారి పెరిగిన ఓట్లకు తగినట్లుగా చెల్లని ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. రాజకీయ చైతన్యానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు ప్రతీక. అలాంటిది ఇక్కడి పట్టభద్రులు ఓటు వేసే విషయంలో నిబంధనలు పాటించక వేల సంఖ్యలో ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,47,116 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 26,909 మంది.. బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయడంలో పొరబాట్లు చేశారు.