తగ్గిన పర్యాటకుల తాకిడి
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:01 AM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలలో ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగా ఉన్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు మొదలుకానుండడంతో పాటు పర్యాటక సీజన్ ముగియడంతో పర్యాటకుల రాక తగ్గింది.

- విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో కానరాని సందడి
పాడేరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలలో ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగా ఉన్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు మొదలుకానుండడంతో పాటు పర్యాటక సీజన్ ముగియడంతో పర్యాటకుల రాక తగ్గింది. దీంతో ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఆశించిన సందడి వాతావరణం లేదు. అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, తదితర ప్రాంతాలను పర్యాటకులు అంతంతమాత్రంగానే సందర్శించారు.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు అందాలు కనుమరుగు కావడంతో పాటు వాతావరణంలో మార్పు రావడం వల్ల సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీకెండ్స్‌లో అతి తక్కువ మంది పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు. ఆదివారం తక్కువ మంది పర్యాటకులు చెరువులవేనం, తాజంగి జలాశయాన్ని సందర్శించారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికి రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు లోపే నమోదవుతున్నాయి. గిరిజన ప్రాంతంలో వేసవి వాతావరణం కనిపిస్తున్నప్పటికి ఉదయం ఏడు గంటలలోపు ఓ మాదిరిగా మంచు కనిపిస్తుంది. దీంతో సీజన్ ముగిసినప్పటికి కొంత మంది పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు.
బొర్రా గుహలు వద్ద..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు ఆదివారం ఓ మోస్తరుగా పర్యాటకులు వచ్చారు. బొర్రా గుహలను 2,200 మంది సందర్శించగా, రూ.1.75 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.