గోదారి.. నీరేది!
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:24 AM
రానున్న రెండు నెలలు ప్రజలు తాగు, సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటికీ శివారు భూములకు దాళ్వాకు అవసరమైన సాగునీరందని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడిని అధిగమించడానికి జలవనరులశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర ప్రయోజనాలు చేకూర్చడంలేదు. డ్రెయిన్లలో క్రాస్‌బండ్లు ఏర్పాటు చేసి శివారు ప్రాంత భూములకు నీరందించాలని కోనసీమ కలెక్టర్ ఇప్పటికే ఇరిగేషన్, డ్రెయిన్ల అధికారులకు ఆదేశాలిచ్చారు.ఆ దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాలువలు కట్టేస్తే.. గొంతు తడిపేది కన్నీళ్లే!
మరో పది రోజుల్లో నీరు బంద్
కాలువలు కట్టేస్తున్నట్టు ప్రకటన
నేటికీ నిండని చెరువులు
కళతప్పిన జలాశయాలు
శివారుకు అందని సాగునీరు
ప్రస్తుత నీటిమట్టం 9.5 అడుగులు
గతేడాది ఇదే రోజు 6.5 అడుగులు
239 టీఎంసీలు వినియోగం
సముద్రంలోకి 4114 టీఎంసీలు
తూర్పుగోదావరి.. పేరులోనే గోదావరి.. ఎందుకంటే.. జిల్లాకు జీవం గోదావరి.. ఆ గోదారే లేకపోతే ఈ ప్రాంతమంతా ఎడారే.. ఆ నాడు కాటన్ మహాశయుడు గోదావరిపై బ్యారేజీ నిర్మించి గోదావరి జిల్లాల రైతులకెంతో మేలు చేశాడు. అందుకే నేటికీ కాటన్‌ను జిల్లావాసులు దేవుడిగా కొలుస్తారు. గోదావరి ద్వారా ప్రతి ఏటా వేలాది టీఎంసీల నీరు మనకు లభిస్తున్న సంగతి తెలిసిందే.అందులో కొద్దిశాతం కూడా మనం వినియోగించు కోలేకపోతున్నాం. తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాం. నేటికీ ఈ పరిస్థితుల్లో మార్పురాలేదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఉందంటే నిర్లక్ష్యమే కారణం..
(రాజమహేంద్రవరం/ అమలాపురం - ఆంధ్రజ్యోతి)
రానున్న రెండు నెలలు ప్రజలు తాగు, సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటికీ శివారు భూములకు దాళ్వాకు అవసరమైన సాగునీరందని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడిని అధిగమించడానికి జలవనరులశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర ప్రయోజనాలు చేకూర్చడంలేదు. డ్రెయిన్లలో క్రాస్‌బండ్లు ఏర్పాటు చేసి శివారు ప్రాంత భూములకు నీరందించాలని కోనసీమ కలెక్టర్ ఇప్పటికే ఇరిగేషన్, డ్రెయిన్ల అధికారులకు ఆదేశాలిచ్చారు.ఆ దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా రబీ సీజన్‌తోపాటు మంచి నీటి అవసరాలు, చెరు వులకు సుమారు 120 టీఎంసీలు అంచనా వేస్తారు. ఇప్పటివరకూ 103 టీఎంసీల నీటిని వాడారు.11,300 క్యూసెక్కుల నీటిని ఒక టీఎం సీగా పరిగణిస్తారు. మరో పది రోజుల పాటు కాల్వలకు నీరిస్తారు. ఈలోపు పంట అవసరా లు, మంచినీటి అవసరాలు, చేపల చెరువులకు అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే నీరు కాల్వలకు పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో మంచినీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు నింపే పరిస్థితి లేదనేది ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజల ఆవేదన. కోనసీమ జిల్లా పరిధిలోని నాలుగు మునిసిపాలిటీలు, 22 మండలాల పరిధిలో 220కు పైగా గ్రామాలు ఉండగా వాటిలో సముద్రతీర ప్రాంతాల ప్రజలకు తాగునీరందని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ 15 వరకు ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేయడానికి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.కలెక్టర్ ఆమోదం తరువాత వీటికి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ సారి ప్రాజెక్టులకు నీటి సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇరిగేషన్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
16 నుంచి నీరు బంద్
ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి వివిధ ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లే డెల్టా కాలువలను ఈనెల 16న మూసివేయనున్నారు. ప్రతి ఏటా రబీ సీజన్ ముగిసిన తర్వాత మంచినీటి అవసరాలకు నీటిని ఇచ్చి కాలువలకు నీటి విడుదల నిలుపుదల చేస్తారు. అనంతరం కా లువల ఆధునీకరణ పనులు చేస్తారు. జూన్ 1వ తేదీన కాలువలు తెరిచే అవకాశం ఉంది.
సముద్రంలోకి వేలాది టీఎంసీలు
గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ధవళే శ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 4114 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. కేవలం 239 టీఎంసీల నీరు మాత్ర మే వినియోగించాం. ఒక టీఎంసీ అంటే 11,300 క్యూసెక్కులు నీరు.ఒక టీఎంసీ నీటిని వదిలితేనే మన డెల్టా కాలువలు కళకళలా డిపోతాయి. అలాంటిది వేల టీఎంసీల నీటిని వినియోగించుకుంటే గోదావరి జిల్లాలతో పా టు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. గత వైసీపీ నిర్లక్ష్యం చేసినా.. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు పోలవరం పనులు వేగవంతం చేశారు.
ఆ మూడింటికి నీటి ఎద్దడి తప్పదా!
సామర్లకోట : సామర్లకోట గోదావరి కాలు వకు గత రెండు రోజులుగా నీటి విడుదల తగ్గింది. దీంతో సాగు, తాగునీటికి ఆందోళన చెందుతున్నారు. సామర్లకోట,పెద్దాపురం ము నిసిపాలిటీల ప్రజలకు తాగునీటి సరఫరాకు సామర్లకోటలో వేసవి జలాశయం, మహర్షి సాంబ మూర్తి రిజర్వాయర్లు ఉన్నాయి. మహ ర్షి సాంబమూర్తి రిజర్వాయర్ నుంచే కాకినాడ కార్పొరేషన్ ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తారు.అయితే ఈ జలాశయాల్లో నీటి నిల్వ లు అడు గంటితే గోదావరి కాలువ నుంచి జలాలను మళ్లించి నిల్వలు పెంచుతారు. సా మర్లకోట గోదావరి కాలువకు రెండు రోజు లుగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో సామ ర్లకోటలో ఉన్న రెండు జలాశయాలకు నీటిని మళ్లించలేకపో తున్నారు. ప్రస్తుతం గోదావరి కాలువ నుంచి నీటిని మళ్లించకపోతే రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమా దం ఉంది. ఈ ఏడాది జలాశయంలో పూడిక తొలగింపు పనులు చేపడతామని గోదావరి జలాలను జలాశయంలోకి మళ్లించే ప్రక్రియ గత నెల రోజుల పైబడి నిలిపివేశారు. దీంతో గోదావరి కాలువ నుంచి వస్తున్న కొద్దిపాటి జలాలనే నేరుగా ఫిల్టర్‌వాటర్ స్కీమ్‌కు పం పింగ్ చేసి అరకొరగా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.నీటి అక్రమ వినియోగం నియంత్రించలేకపోవడం వల్ల సామర్లకోట, ఉండూరు, వీకె.రాయపురం, మాధవపట్నం, బోయినపూడి, పిఠాపురం బ్రాంచి కాలువలకు చెందిన ఆయకట్టు పొలాలకు నీటి ఎద్దడి నెల కొంది.తాగునీటి జలాశయాలకు నీటి మళ్లింపు పూర్తిగా నిలిచిపోవడంతో మరో వారం రోజు ల్లో సామర్లకోట, పెద్దాపురం మునిసిపాలి టీలు, కాకినాడ నగరపాలక సంస్థల ప్రజలు తాగునీటికి అవస్థలు పడక తప్పదని ఆందో ళన చెందుతున్నారు. సామర్లకోట గోదావరి కా లువకు ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఉన్నతా ధికారులు 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ 60 కిలోమీటర్ల శివారున ఉన్న సామర్లకోటకు చేరేసరికి కేవలం 300 క్యూసెక్కుల నీరు అందుబా టులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. సాగునీటి అవసరాలే అంతంత మా త్రంగా ఉన్న సమయంలో ఇక తాగునీరు మళ్లింపు మరింత కష్టంగా మారనున్నాయి.
బ్యారేజీ వద్ద నీటిమట్టం ఇలా
ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ పరిఽధిలో తూర్పు డెల్టాలో 2,64,533 ఎకరాలు, కోనసీమ (సెం ట్రల్ డెల్టా)లో 1లక్షా 72వేల ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 4 లక్షల 60వేల ఎక రాలు ఆయ కట్టు ఉంది.రబీ సీజన్ డిసెంబర్‌లో మొదలైంది. పూర్తిగా నాట్లు పడేసరికి జనవరి దాటేసింది. ఈ నేపథ్యంలో కొంతనీటి సమస్య ఉంది. వాస్తవానికి నవంబర్ 1న రబీ సీజన్ మొదల య్యేటట్టు ప్లానింగ్ ఉంటే రబీకి నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం సీలేరు నుంచి 8 వేల క్యూ సెక్కుల నీరు వస్తోంది. తూర్పు డెల్టాకు 3 వేల క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2 వేల క్యూ సెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,300 క్యూసె క్కులు విడుదల చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే వద్ద సుమారు 20 టీఎంసీల వరకూ నీరు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌కు పెద్దగా నీటి సమస్య ఉండదని ఇరిగేషన్ ఎస్‌ఈ కె.గోపీనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం ప్రస్తుతం 9.5 అడుగులు ఉంది. గతేడాది ఇదే సమయానికి కేవలం 6.05 అడుగులు మాత్రమే ఉంది. గతేడాది కంటే ఈసారి బాగుందని లెక్కలు చెబుతున్నాయి.