Excise Police: భారీగా గోవా మద్యం పట్టివేత
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:40 AM
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలోని చేపల చెరువు వద్ద గోవా లేబుల్స్‌తో ఉన్న 4080 మద్యం బాటిళ్లను బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

నరసాపురం రూరల్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలోని చేపల చెరువు వద్ద గోవా లేబుల్స్‌తో ఉన్న 4080 మద్యం బాటిళ్లను బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న నరసాపురం మునిసిపల్ కౌన్సిలర్ బర్రె జయరాజుతో పాటు డి.రామకృష్ణ, గొల్లమందుల జయబాబు అనే వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జయరాజు భార్య వెంకట రమణ ప్రస్తుతం నరసాపురం వైసీపీ మునిసిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఎక్సైజ్ సీఐ రాంబాబు విలేకర్లకు తెలిపిన వివరాల ప్రకారం.... రావి బ్రహ్మజీ చేపల చెరువును వైసీపీ కౌన్సిలర్ జయరాజు లీజ్‌కు తీసుకున్నారు. ఇక్కడ అనధికారికంగా మద్యం బాటిళ్లు నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో దాడి చేశామని, పట్టుబడిన మద్యం అంతా గోవా లేబుల్స్‌తో ఉన్నాయన్నారు. గోవా నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారని, ఈమద్యం ఎలా వచ్చింది విచారిస్తున్నామన్నారు.