Share News

Vijayawada : కోర్టులో తిట్లు.. జైల్లో చిందులు

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:18 AM

అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అక్కడి అధికారులపై సదుపాయాలు, సౌకర్యాల కోసం చిందులు తొక్కారు.

Vijayawada : కోర్టులో తిట్లు.. జైల్లో చిందులు

  • ఆ బ్యారక్‌లో ఉండను ఈ టాయిలెట్‌ వాడను

  • జైలులో అధికారులపై వంశీ వీరంగం

  • నడుం నొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు

  • అక్కర్లేదన్న వైద్యులు

విజయవాడ, విశాఖపట్నం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అక్కడి అధికారులపై సదుపాయాలు, సౌకర్యాల కోసం చిందులు తొక్కారు. తనకు కేటాయించిన బ్యారక్‌లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి ప్రత్యక్ష సాక్షి, ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. జైలులో ఒకటో నంబర్‌ బ్యారక్‌లో గదిని ఇచ్చారు. 7641 రిమాండ్‌ ఖైదీ నంబర్‌ను కేటాయించారు. అయితే, బ్యారక్‌ ఏమాత్రం శుభ్రంగా లేదని, తనకు మరొకటి కేటాయించాలంటూ వంశీ వీరంగం చేసినట్టు తెలిసింది. జైలులో ఉన్న అన్ని బ్యారక్‌ల్లో ఖైదీలు ఉన్నారని, ఉన్నవాటిలో మంచి బ్యారక్‌నే కేటాయించామని అధికారులు నచ్చజెప్పాలని ప్రయత్నించినా, ఆయన శాంతించలేదు. బాత్‌రూంలో వెస్ట్రన్‌ టాయ్‌లెట్‌ కావాలని పట్టుబట్టారు. అయితే, దాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకు దిగారు. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేనని ఆయన అనగా, దీన్ని వైద్యులకు చెబుతామని, వారు సూచిస్తే మంచం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. జైలులో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు. ఆయనకు ఎలాంటి వెన్నునొప్పి లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన అసహనంతో ఊగిపోయారు. జైలు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.


జైలులో ఉన్న సదుపాయాలనే తాము నిబంధనల ప్రకారం కల్పిస్తామని, అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కోర్టు ఆదేశాలు ఇస్తే ఆవిధంగా చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారులతో కాసేపు వాదన చేసిన వంశీ, ఆ తర్వాత బ్యారక్‌లోకి వెళ్లిపోయారని విశ్వసనీయంగా తెలిసింది.

వంశీ పీఏ, డ్రైవర్‌ అరెస్టు

ముదునూరి సత్యవర్థన్‌ను కిడ్నాప్‌ చేసి, బెదిరించిన కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ4గా ఉన్న ఘంటా వీర్రాజు అలియాస్‌ రాజు, ఏ5గా ఉన్న వంశీబాబును అరెస్టు చేశామని పటమట పోలీసులు శుక్రవారం తెలిపారు. వంశీబాబు కారును సీజ్‌ చేశారు. వంశీకి వీర్రాజు పీఏ కాగా, వంశీబాబు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కాగా, కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీ పాత్రపై అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. టెక్నాలజీ సర్వైలెన్స్‌ నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - Feb 15 , 2025 | 03:18 AM