Ambedkar Jayanti: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 14 , 2025 | 09:04 AM
Ambedkar Jayanti: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు.

అమరావతి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా... ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని తెలిపారు. దళిత అభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
దేశానికి అంబేద్కర్ సేవలు నిరుపమానం: మంత్రి నారా లోకేష్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని చెప్పారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని గుర్తుచేసుకున్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడారు:మంత్రి అనగాని సత్యప్రసాద్
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ నివాళులు అర్పించారు. భారత దేశ అగ్రగణ్య మేధావుల్లో బీఆర్ అంబేద్కర్ ఒకరని స్మరించుకున్నారు. ఆధునిక భారత దేశ నిర్మాణంలో ఆయనది చాలా కీలక పాత్ర అని గుర్తుచేసుకున్నారు. దేశంలోని పౌరులందరికీ సమానత్వం, గౌరవం కల్పించాలని పరితపించారని అన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతం పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని తెలిపారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యమకారుడని చెప్పారు. మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం ముందుండి నడిచిన నేత అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు నేటికి కూడా ఎంతో ఆచరణీయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడారు: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి నివాళి అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం, సమాజంలోని రుగ్మతలపై అంబేద్కర్ తన చివరి శ్వాస వరకు పోరాడారని తెలిపారు. రాజ్యాంగ ఫలాలతో బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. అంబేద్కర్ ది విగ్రహం కాదు దళితుల ఆత్మగౌరవానికి చిహ్నమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. పీ4తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడానికి చంద్రబాబు పాటుపడుతున్నారని చెప్పారు. అంబేద్కర్ కలలు కన్న సమాజం కూటమి పాలనతోనే సాధ్యమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Minister Nara Lokesh: మీ కోసం నిలబడతా.. పోరాడతా
Police Dogs: పోలీసు జాగిలం.. బిజీబిజీ..
TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!
Read Latest AP News And Telugu News