Venkaiah Naidu: జమిలి ఎన్నికలతో సుస్థిర పాలన
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:04 AM
జమిలి ఎన్నికల ద్వారా దేశానికి సుస్థిర పాలన సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు

ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడంలేదు: వెంకయ్య
తిరుపతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల పాటు ఏదో ఒక ఎన్నికల గురించి వ్యూహాలు పన్నుకుంటూ, ఎన్నికల మూడ్‌లోనే ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ఒకసారి గెలిస్తే ఐదేళ్లు స్థిరంగా ఉండి, అభివృద్ధి చేస్తామన్న భరోసా కూడా రాజకీయ పార్టీలకు వస్తుంది. అప్పుడే గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. జమిలి ఎన్నికలతోనే ఇది సాధ్యమవుతుంది’ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయడు అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం వంటి అంశాలపై శనివారం ఉదయం తిరుపతిలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జమిలి ఎన్నికల గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏకకాల ఎన్నికలు మనకు కొత్తేమీ కాదన్నారు. 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం రాజకీయ కారణాల వల్లే కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. సగటు భారతీయ ఓటరు తెలివి, వివేచనను తక్కువ అంచనా వేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
జమిలి ఎన్నికలతో సమయం మిగులుతుందని, ఖర్చు తగ్గుతుందని, మిగిలిన నిధులను సంక్షేమం, అభివృద్ధికి వినియోగించవచ్చని చెప్పారు. కాగా, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలని వెంకయ్య కోరారు. ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారో ఆ పార్టీ నచ్చకపోతే పదవికి కూడా రాజీనామా చేసేలా చట్ట సవరణ చేయాలన్నారు. విద్య, వైద్య సౌకర్యాలు మినహా ఏది ఉచితంగా ఇస్తామని చెప్పినా, ఎవరు చెప్పినా అది అనుచితమేనని అన్నారు.