Share News

Kasireddy Rajasekhar Reddy: ప్రణాళిక ప్రకారమే పరార్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:14 AM

వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ప్రణాళిక ప్రకారం పరారయ్యాడు. సిట్‌ విచారణలో అతని కుటుంబ సభ్యుల కంపెనీలలో సోదాలు, కీలక డాక్యుమెంట్లు సీజ్‌

Kasireddy Rajasekhar Reddy: ప్రణాళిక ప్రకారమే పరార్‌
Raj Kasireddy

  • కొందరు పోలీసుల సహకారంతోనే కసిరెడ్డి అజ్ఞాతంలోకి

  • రాజ్‌ తండ్రిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

  • విచారణకు సహకరించని ఉపేందర్‌ రెడ్డి

  • అన్ని ప్రశ్నలకూ ‘తెలియదు’ అనే సమాధానం

  • బెజవాడ సిట్‌ ఆఫీసుకు రావాలంటూ నోటీసు

  • హైదరాబాద్‌లో రెండోరోజూ సిట్‌ సోదాలు

  • రాజ్‌ మరదలి కంపెనీ లావాదేవీల పత్రాలు సీజ్‌

  • స్నేహితుడి ఫామ్‌హౌ్‌సలో రాజ్‌ కారు స్వాధీనం

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి, పాత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ప్రణాళిక ప్రకారమే పరారైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారణకు వచ్చింది. జగన్‌ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన కొందరు పోలీసు అధికారుల సహకారంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి విచారణకు డుమ్మా కొట్టిన రాజ్‌ కసిరెడ్డి ఆచూకీ కోసం సిట్‌ అధికారులు రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి సోదాలు చేపడుతున్నారు. రెండోరోజు తనిఖీల్లో భాగంగా మంగళవారం రాజ్‌ కసిరెడ్డి భార్యకు సోదరి అయ్యే మేఘనా రెడ్డి, ఆమె తల్లి సుజాత రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తనిఖీలు చేశారు. ఈ కంపెనీ ద్వారా ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించిన సిట్‌.. గత ఐదేళ్ల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సీజ్‌ చేసినట్లు తెలిసింది. మరోవైపు కసిరెడ్డి భార్య దివ్యా రెడ్డి, ఆమె సమీప బంధువు తీగల విజయేందర్‌ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఆరేటి ఆసుపత్రిలోనూ అధికారులు సోదాలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు సీజ్‌ చేసినట్లు సమాచారం.


నిందితుడి కుమార్తె ఇషానీ పేరుతో నిర్వహిస్తున్న ఈడీ క్రియేషన్స్‌ లావాదేవీలపైనా కూపీ లాగిన సిట్‌ మంగళవారం రాత్రి వరకూ సోదాలు నిర్వహిస్తూనే ఉన్నట్లు తెలిసింది. ఇదిలాఉండగా, రాజ్‌ కసిరెడ్డి కోసం గాలిస్తున్న సిట్‌ అధికారులకు అతని తల్లిదండ్రుల ఆచూకీ లభించింది. అక్కడకు వెళ్లి నిందితుడి తండ్రి ఉపేందర్‌ రెడ్డిని ప్రశ్నించారు. అయితే కుమారుడి ఆచూకీ, ఫోన్‌ నంబరు, వాడే కారు, అతని స్నేహితుల గురించి ఏది అడిగినా ‘తెలియదు’అనే సమాధానం ఒక్కటే చెప్పారని, దీంతో విజయవాడలోని సిట్‌ ఆఫీసులో విచారణకు రావాలని ఆయనకు నోటీసు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు కసిరెడ్డికి చెందిన రూ.1.33 కోట్లు విలువైన విలాసవంతమైన కారును హైదరాబాద్‌ శివారులోని అతడి స్నేహితుడికి చెందిన ఫామ్‌హౌ్‌సలో సిట్‌ అధికారులు గుర్తించారు. రాజ్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లిన అధికారులకు కారు మాత్రమే కనిపించింది. దాన్ని సీజ్‌ చేసి, కసిరెడ్డి ఆచూకీ కోసం ఏఐ సాంకేతికత సాయంతో గాలిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 16 , 2025 | 08:51 AM