ప్రమాదంలో కృష్ణా వాటా: సీఎంకు లక్ష్మీనారాయణ లేఖ
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:05 AM
కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించేందుకు న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌లో వాదనల నేపథ్యంలో కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రం వాటా ప్రమాదంలో పడింది. తక్షణమే రాష్ట్రం తరఫున సమర్థవంతమైన వాదనుల వినిపించేలా న్యాయవాడుల బృందాన్ని ఏర్పాటు చేయాలి’ అని నదీ జలాల నిపుణుడు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి.లక్ష్మీనారాయణ అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ‘ఈ నెల 16, 17 తేదీలలో కృష్ణా జలాల వివాదంపై వాదనలు వినిపించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమర్ధులైన న్యాయవాదుల బృందాన్ని నియమించాలి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలి. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు రాజకీయ ఉద్దేశంతో న్యాయ పోరాటం చేస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల విషయంలో మరింత పట్టుదలతో పోరాటం చేస్తోంది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు ముందు తెలంగాణ రాష్ట్రం బలమైన వాదనలు వినిపించేందుకు న్యాయవాదుల బృందాన్ని 2024లో ఏర్పాటు చేసింది. జల వనరుల శాఖలో సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన పూర్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించుకున్నారు. ట్రైబ్యునల్, సుప్రీం కోర్టులో వ్యాజ్యాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇది రాష్ట్రానికి ఇబ్బందికరమే. ఈ ఏడాది జూలై చివరిలో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కాలపరిమితి ముగియనుంది. దీంతో కృష్ణా జల వివాదంపై విచారణను వేగవంతం చేస్తోంది’ అని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు.