AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:14 PM
AP Govt: వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి, జనవరి 28: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు (Retired IPS AB Venkateshwar Rao) ఏపీ ప్రభుత్వం (AP Govt) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ సర్కార్ మంగళవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020-2024 మధ్య రెండు సార్లు ఏబీవీ సస్పెండ్ అయ్యారు. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫా ఏబీవీని సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. అలాగే రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది.
YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్
కాగా.. ఇటీవలే ఏబీవీపై నమోదైన అభియోగాలను వెనక్కు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనల విరుద్దంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కోనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అనంతరం ఆయనపై రెండు దఫాలుగా సస్పెన్షన్ వేటు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. కుమారుడి కంపెనీనీ అడ్డుపెట్టుకుని నిఘా పరికరాలు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ గత ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు సార్లు సస్పెన్షన్‌కు గురైన ఏబీవీ.. ఆ రెండు సార్లు తనకు జీతం ఇవ్వాలని అభ్యర్థనలు పెట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీపై గత ప్రభుత్వం రెండు సార్లు విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలు తీసుకోలేమని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి...
TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ
ఉదయం 10 తర్వాత తత్కాల్ బుకింగ్ పనిచేయదు..!
Read Latest AP News And Telugu News