Liquor Scam: సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ABN , Publish Date - Apr 09 , 2025 | 09:24 AM
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి సిట్ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్‌వర్క్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.

అమరావతి: వైసీపీ (YCP) హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణానికి (liquor Scam) పాల్పడిన జగన్ (Jagan) దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (Kasireddy Rajasekhar Reddy)కి సిట్ మరోసారి నోటీసు (Notice) జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలంటూ విజయవాడ (Vijayawada) పోలీస్ కమిషనర్ (police commissioner) రాజశేఖర్ బాబు (Rajasekhar Babu) నేతృత్వంలోని సిట్ ఆయనకు మూడోసారి నోటీసు ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన రెండు నోటీసులపై హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో కలసి పనిచేసిన రాజ్ కసిరెడ్డి... వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు ‘జే’ బ్రాండ్ల సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమీషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు రూ.3వేల కోట్ల వరకూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లు రాజ్ కసిరెడ్డిపై సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. లంచాల నెట్‌వర్క్‌ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పెద్దరెడ్డిగా పేరున్న నాయకుడితో కలసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకొని దందా నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో... ఏ రోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డే నిర్ణయించేవారని సమాచారం.
Also Read..: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి దంపతులు ..
అయితే ఐటీ సలహాదారుడిగా ఉన్న తనకు నోటీసులు ఎలా ఇస్తారని కసిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మూడోసారి నోటీసులు ఇచ్చి, ఈనెల 9వ తేదీన (బుధవారం) హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే కసిరెడ్డిక అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్‌లో అతని తల్లికి నోటీసులు ఇచ్చారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి పాత్ర కీలకమని పోలీసులు అంటున్నారు. కాగా ఈరోజు కసిరెడ్డి విచారణకు వస్తారా... రారా అనే సంధిగ్దత నెలకొంది.
మూడుసార్లు నోటీసులు జారీ
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివసించే జర్నలిస్టు కాలనీలోని ఇంటికి సిట్ అధికారులు మార్చి 25న మొదటిసారి నోటీసులు పంపారు. అదే నెల 28న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పనివాళ్లకు ఇచ్చారు. రెండోసారి హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్‌లో ఉంటున్న ఆయన తల్లికి 26న నోటీసులు అందజేశారు. అందులో మార్చి 29న విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. దీంతో ఈ-మెయిల్ సందేశం పంపిన కసిరెడ్డి... వివరాలు చెబితేనే విచారణకు వస్తానంటూ మెలిక పెట్టారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సిట్ బదులివ్వడంతో ఇందులో తనకు ఏ సంబంధం లేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 4న విచారణ జరిపిన హైకోర్టు... సిట్ నోటీసులకు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దీంతో శనివారం సిట్ అధికారులు కసిరెడ్డికి మూడోసారి నోటీసు ఇచ్చారు.
సాయిరెడ్డి వ్యాఖ్యలతో కలకలం
దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు... ఏడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న రాజ్ కసిరెడ్డి రూ.వేల కోట్లు తాడేపల్లి బాస్ చెప్పిన చోటికి చేర్చినట్లు తెలుస్తోంది. ఆర్డర్లు పొందిన మద్యం కంపెనీల నుంచి సేకరించిన లంచాల మొత్తం మొదట క్యాష్ హ్యాండ్లర్లకు, ఆ తర్వాత ఒకరిద్దరు నమ్మకస్తుల ద్వారా రాజ్ కసిరెడ్డికి చేరేది. విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తాయని, వాటిపై ప్రశ్నిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన రాజ్ కసిరెడ్డి... తాను తెలంగాణలో ఉన్నానని, సీఐడీ ఆధ్వర్యంలోని సిట్‌కు రాష్ట్రం బయట పరిధి లేదని, నోటీసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించి భంగపడ్డారు. మరోవైపు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి సీఐడీ, సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో వేరే కేసులో విచారణకు హాజరైన ఆయన రాజ్ కసిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డే అని మీడియా ముందు ప్రకటించారు. అవసరమైనప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలతో అప్రమత్తమైన సీఐడీ అధికారులు.. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్రపై కీలక సమాచారాన్ని సేకరించి, ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..
H-1B visa: అమెరికా.. కలలు కల్లలు
For More AP News and Telugu News