YCP Leaders: సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. అసలు విషయం ఏమిటంటే..?
ABN , Publish Date - Jan 31 , 2025 | 06:08 PM
YCP Leaders: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ట్రైయిల్ కోర్టులో వెళ్లాలంటూ వారికి స్పష్టం చేసింది.

అమరావతి, జనవరి 31: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం నిరాకరించింది. అయితే గతంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తమ వద్దకు రావాల్సిన అవసరం లేదని.. కింద కోర్టుకు వెళ్లాలంటూ వారికి ఏపీ హైకోర్టు సూచించింది. దాంతో ఈ హైకోర్టు ఉత్తర్వులపై ఈ దాడితో ప్రమేయం ఉందని భావిస్తున్న 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో తాము సైతం జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. ముందస్తు బెయిల్ కోసం ట్రయిల్ కోర్టునే ఆశ్రయించాలని వారికి జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు.. ట్రయల్ కోర్టును రెండు వారాల్లో ఆశ్రయించేందుకు గడువు సైతం వారికి ధర్మాసనం కల్పించింది.
ఇక ఈ వ్యవహారంలో రెండు వారాల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వాన్ని సైతం కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఉన్నత స్థాయి కోర్టుల వ్యాఖ్యలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తాము సైతం కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
2023, ఫిబ్రవరి 19వ తేదీన గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై అప్పటి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించి కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. అంతకుముందు రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌పై ఎమ్మెల్యే వంశీ వ్యక్తిగత చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఆ క్రమంలో వల్లభనేని వంశీపై వారు విమర్శలు గుప్పించారు.
Also Read : రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు
దీంతో తమ నాయకుడినే విమర్శిస్తారా? అంటూ వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకొని దాడికి దిగారు. ఇక కార్యాలయంపై దాడి చేసిన సమయంలో.. టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా నివాసంపరై వారు దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వంశీ అనుచరులు అక్కడి నుంచి వెనుదిరిగారు. సాయంత్రం పార్టీ కార్యాలయానికి చేరుకొని ఈ దాడికి పాల్పడ్డారు.
Also Read : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ సందర్బంగా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ దాడులకు తెగ బడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ఈ కేసులో కదలిక ఏర్పడింది. ఆ క్రమంలో ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Also Read : ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’
దీంతో ముందస్తు బెయిల్ కోసం ఈ కేసులో నిందితులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిని హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 89 మంది నిందితులగా చేర్చారు. ఇదే కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏ 71గా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో పలువురు ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో తమకు ముందస్తు బెయిల్ కోసం మిగిలిన వారు..హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో.. వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ సైతం వారికి చుక్కెదురు అయింది.
For AndhraPradesh News And Telugu News