Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:14 PM
రాజకీయ సన్యాసం తర్వాత విజయసాయిరెడ్డి ఏమి చేయబోతున్నారు. ట్వీట్‌లో చెప్పినట్లు వ్యవసాయం చేయనున్నారా.. ఇంకేదైనా ప్లాన్ ఉందా.. రాజకీయాలను వదిలి ఆయన కొత్తగా ఏ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.

రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. భవిష్యత్తు వ్యవసాయమే అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చినప్పటికీ.. వ్యవసాయం చేయడం కోసమే విజయసాయిరెడ్డి రాజకీయాలను విడిచిపెట్టారనే వాదనతో చాలామంది ఏకీభవించడం లేదు. విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాలకు ముందు ప్రముఖ అడిటర్‌గా పేరు సంపాదించిన విజయసాయిరెడ్డి.. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండటంతో పాటు.. మాజీ సీఎం జగన్‌తో కలిసి సుమారు 16 నెలలు జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి కీలకంగా మారారు.
జగన్ తర్వాత పార్టీలో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడంతో.. విజయసాయిరెడ్డి పైకి చెప్పకపోయినా కొంత అసంతృప్తితోనే ఉండేవారనే చర్చ జరిగింది. పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడాన్ని... అవమానంగా భావించిన విజయసాయిరెడ్డి కొంతకాలం పార్టీలో ఉన్నా అంటిముట్టనట్లు వ్యవహారించారనే ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సీనియర్ నేతలు చాలామంది వైసీపీని వీడుతున్నప్పటికీ.. విజయసాయిరెడ్డి మాత్రం అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. తాజాగా విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంతో పాటు రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది.
భవిష్యత్తు ప్లాన్ అదేనా..
తన భవిష్యత్తు వ్యవసాయమని ట్వీట్ చేసినా.. విజయసాయిరెడ్డి పెద్ద ప్లాన్‌తోనే రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. మీడియా రంగంలోకి ఎంటర్ అవ్వడం కోసమే రాజకీయాలను వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. తాను ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ప్లాన్ చేసినా, జగన్ వద్దన్నారని ఈసారి మాత్రం ఆయన చెప్పినా వినబోనని విజయసాయిరెడ్డి కొద్దినెలల క్రితం తన మనసులో మాటను బయటపెట్టేశారు. వైసీపీలో ఉండి ఛానల్ పెడితే జగన్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉండి ఉండవచ్చని, లేదంటే తన ప్లాన్‌కు అడ్డురావచ్చనే ఉద్దేశంతోనే పూర్తిగా రాజకీయాలను వదిలేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయపార్టీలో ఉండి ఛానల్ పెడితే దానిపై పార్టీ ముద్ర పడే అవకాశం ఉండటంతో.. తాను ఏ రాజకీయపార్టీ పక్షం కాదని చెప్పుకునేందుకే వైసీపీని వీడటంతో పాటు రాజకీయాలకు బైబై చెప్పినట్లు చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయడం కోసమే రాజకీయాలను వదిలేశారా లేదంటే మీడియా రంగంలోకి ఎంట్రీ కోసమా అనేది మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది. ఈ రెండు కాకుండా విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here