మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు: ఎస్పీ
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:40 AM
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చర్యలు తప్పవని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా హెచ్చరించారు.

పాములపాడు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చర్యలు తప్పవని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా హెచ్చరించారు. పాములపాడు పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించి పెండింగులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిపై డ్రోన్‌లు వినియోగించి కేసులు నమోదు చేస్తున్నా మని తెలిపారు. హైవే పనులు జరుగుతుండడంతో ప్రమాదాలు జరగ కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, గత ఏడాదికంటే ఈ ఏడాది జిల్లాలో క్రైం రేటు తగ్గిందని తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతున్నామని చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు పోలీసులు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, లేదంటే పోలీసులకు జరిమానా విధించాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ క్వాటర్స్ శిదిలావస్థకుకు చేరుకున్నాయని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్‌ఐ సురేశ్‌కుమార్, పోలీసులు ఉన్నారు.
ఆత్మకూరు: ఆత్మకూరు పోలీసు స్టేషన్‌ను బుధవారం ఎస్పీ ఆధిరాజ్‌సింగ్ రాణా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతి గురించి అర్బన్ సీఐ రామును అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వాటి వివరాలను ఆరా తీశారు. అదేవిధంగా స్టేషన్‌లోని రిసెప్షన్‌ను పరిశీలించి తేదీల వారిగా ప్రజల నుంచి ఫిర్యాదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. న్యాయస్థానాల్లోని ముఖ్యమైన కేసుల్లో నేరగాళ్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యంపై, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు, క్రికెట్ బెట్టింగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం తదితర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా యువతకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని సూచించారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఉన్నారు.