Share News

నిధులు లేవు.. నీళ్లు రావు!

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:15 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో గంపెడు మట్టి తీయలేదు.

నిధులు లేవు.. నీళ్లు రావు!
ముళ్ల కంపతో నిండిపోయిన పత్తికొండ జలాశయం

హంద్రీ నీవా పంట కాలువలపై అంతులేని నిర్లక్ష్యం

అసంపూర్తిగా పత్తికొండ జలాశయం, కుడి ఎడమ కాలువలు

గత వైసీపీ హయాంలో ఒక్క పైసా ఇవ్వని వైనం

టీడీపీ ప్రభుత్వంపై ఆశలు

రూ.230 కోట్లు ఇస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు

నేడు హంద్రీ నీవా కాలువను సందర్శించనున్న

జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు

వైసీపీ ప్రభుత్వ హయాంలో గంపెడు మట్టి తీయలేదు. ఐదేళ్ల నిర్లక్ష్యం కరువు రైతులకు శాపంగా మారింది. హంద్రీ నీవా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పత్తికొండ (పంది కోన) జలాశయం సహా కుడి, ఎడమ కాలువలను అసంపూర్తిగా వదిలే శారు. రూ.210 కోట్లు ఖర్చు చేస్తే 42,894 ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. కానీ నిధులు ఇవ్వడం లేదు. హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ సరే.. పంట కాలువలను పట్టించుకోరా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేడు జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పత్తి కొండ నియోజకవర్గంలో హంద్రీ నీవా కాలువను సందర్శించనున్నారు. కాలువ విస్తరణ పనులను పరిశీ లిస్తారు. ఇప్పటికైనా మా సమస్యలు పట్టించుకోరా? అని పత్తికొండ జలా శయం కుడి, ఎడమ కాలువ ఆయ కట్టు రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

కర్నూలు, ఏప్రిల్‌ 7 (ఆంరఽధజ్యోతి): హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాశయం ఎగువన 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించాలి. ఫేజ్‌-1 కింద ఉమ్మడి కర్నూలు జిల్లా మాల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలో మీటర్లు ప్రధాన కాలువ, కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ జలాశయాలు, అనంతపురం జిల్లాలో జీడిపల్లి జలాశయం నిర్మించారు. జిల్లాలో 7.5 టీఎంసీలు వినియోగించుకోని 80 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉంది. వానలొస్తే తప్ప పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు నేల తడవని మెట్టప్రాంతం. ఏటేటా కరువు దరువేస్తోంది. ఉత్తర కార్తె దాటిందంటే ఎత్తర గంప అంటూ రైతులు, కూలీలు వలసలు వెళ్లక తప్పని దైన్య పరిస్థితి. సాగునీటి వసతి లేని ఈ ప్రాంతంలో పత్తికొండ (పందికోన) జలశయం నిర్మించి 61,394 ఎకరాలకు సాగునీరు ఇస్తామంటే.. తమ కష్టాలు తీరుతాయని రైతులు జీనాధారమైన పంట పొలాలు త్యాగం చేశారు. కానీ ఇప్పటికీ మిగిలిన పంట చేలను తడిపే పిల్ల కాలువలు అసంపూర్తిగా వదిలేశారు. ఈ ఇరవై ఏళ్లలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. కూటమి ప్రభుత్వమైనా దృష్టి సారించి అసంపూర్తి పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

నిధులిస్తేనే నీళ్లు..!:

హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.5 టీఎంసీలు నీటిని వినియోగించుకొని 80 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ (ఆర్‌బీసీ) పరిధిలో 50,626 ఎకరాలు, ఎడమ కాలువ (ఎల్‌బీసీ) పరిధిలో 10,774 ఎకరాలు కలిపి 61,400 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ప్రస్తుతం 18,500 ఎకరాలకు మించి సాగునీరు ఇవ్వడం లేదు. పిల్ల కాలువలు పూర్తి చేస్తే పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో పలు గ్రామాలు పచ్చని పైర్లతో సస్యశ్యామలం అవుతాయి. కరువు తీరుతుంది. వలసలు ఆగిపోతాయి. కీలకమైన పంట కాలువల పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యం రైతులను శాపాలై వెంటాడుతున్నాయి. 1.216 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన పత్తికొండ జలాశయం రాతి పరుపు (స్టోన్‌ రివిట్‌మెంట్‌), కడ తూము వంటి పనులు సహా ఎడమ కాలువ పరిధిలో సింగిల్‌ లైన్‌ బిడ్జి (ఎస్‌ఎల్‌బీ), ఆర్‌బీసీ, ఫీల్డ్‌ చానల్స్‌, డిస్ట్రిబ్యూటరీలు, కుడి కాలువ (ఆర్‌బీసీ) పరిధిలో దేవనకొండ, ఆస్పరి మండలాల్లో డిస్ట్రీబ్యూటర్లు, ఫీల్డ్‌ చానల్స్‌, ఆర్‌అండ్‌బీ క్రాసింగ్‌ బిడ్జిలు, ఎల్‌బీసీ.. వంటి నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.161 కోట్లు ఇవ్వండని పలుమార్లు ప్రతిపాదనలు పంపితే.. ఒక్కపైసా ఇవ్వలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక అంచనా వ్యయం రూ.210 కోట్లకు చేరింది. నిధులిస్తే 42,894 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. నిధులు ఇచ్చి నీళ్లు ఇస్తారా..? లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రధాన కాలువ విస్తరణ

ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. ఫేజ్‌-1 కింద 3,850 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి వీలుగా ప్రధాన కాలువ విస్తరణ పనులు రూ.1,030 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. దాదాపుగా రూ.300 కోట్లు విలువైన మట్టి పనులు చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. ఐదేళ్లు గంపెడు మట్టి కూడా తీయలేదు. పైగా 6,300 క్యూసెక్కుల విస్తరిస్తామంటూ రూ.6,182.19 కోట్లతో టెండర్లు పిలిచి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత టీడీపీ ప్రభుత్వం చేపట్టి ఆగిపోయిన బ్యాలెన్స్‌ విస్తరణ పనులను రూ.695 కోట్లతో మొదలు పెట్టారు. ఫేజ్‌-2 కింద అనంతపురం జిల్లాలో రూ.1,405 కోట్లతో సీసీ లైనింగ్‌ పనులు చేపట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో జరుగుతున్న విస్తరణ పనులను జిల్లా ఇన్‌చార్జి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు పరిశీలించనున్నారు. ప్రధాన కాలువ విస్త రణ పనులు సరే.. అసంపూర్తిగా వదిలేసిన పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాల్వలపై దృష్టి సారించి అన్నదాతలకు అండగా నిలవాలని కోరుతున్నారు.

సీఎం హామీ అమలు ఏదీ..?

పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో గత ఏడది అక్టోబరు 1న సీఎం చంద్రబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం కొలుదీరాక తొలిసారిగా జిల్లాకు వచ్చారు. హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగునీరు ఇస్తారని ప్రజావేదికలో స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇరిగేషన్‌ ఇంజనీర్లు రూ.6.50 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలలైనా సీఎం హామీ అమలు దిశగా అడుగులు పడడం లేదు. ఇన్‌చార్జి మంత్రి నిమ్మల దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

కరువు తీరాలి.. వలసలు ఆగాలి

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో కరువు, వలసలు నివారణ లక్ష్యంగా 40 వేల ఎకరాలకు సాగునీరు, 1.20 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణానికి రూ.1,985.42 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల జనాభాకు సాగునీటి అందించాలని వేదవతి ఎత్తిపోతల పథకం రూ.1,94.80 కోట్లతో చేపట్టి పనులకు మొదలు పెట్టారు. కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కేసీ కాలువకు 31.90 టీఎంసీలు నీటివాటా ఉన్నా.. నిల్వ చేసుకునే జలాశయం లేదు. సుంకేసులు బ్యారేజీ ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంలో గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి రూ.2,980 కోట్లు మంజూరు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నా.. ఆ దిశగా కదలిక లేదు. పది నెలలు గడిచినా పనులు మొదలు కాకపోవడంతో కరువు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరు.. రోడ్లపై దృష్టి సారించాలి

జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించేందుకు నేడు కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా అధ్యక్షతన జరుగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరవుతున్నారు. జిల్లానే వేధిస్తున్న తాగునీరు, రోడ్ల సమస్యలపై చర్చించాలని పలువురు కోరుతున్నారు. వాటర్‌గ్రిడ్‌ కింద రూ.5,500 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించాలి. అలాగే.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మాణం, ఏపీ టిడ్కో ఇళ్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

నేడు మంత్రి నిమ్మల పర్యటన ఇలా..

సోమవారం విజయవాడ నుంచి రైలులో బయలుదేరిన మంత్రి నిమ్మల మంగళవారం ఉదయం 5.20 గంటలకు గుంతకల్లు రైల్వే గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 8 గంటలకు బయలుదేరి పత్తికొండ సమీపంలోని హంద్రీ నీవా కాలువ వద్దకు 8.45 గంటలకు చేరుకుంటారు. విస్తరణ పనులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలు నగరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3 గంటలకు డీడీఆర్‌ సమావేశానికి హాజరు అవుతారు. రాత్రి 8.30 గంటలకు డోన్‌కు చేరుకొని రైలులో విజయవాడకు బయలుదేరుతారు.

Updated Date - Apr 08 , 2025 | 12:15 AM